Let's talk: editor@tmv.in
బెంగళూరులో టీసీఎస్ 10కే రన్‌కు 36 వేల మంది హాజరు

బెంగళూరులో టీసీఎస్ 10కే రన్‌కు 36 వేల మంది హాజరు

Pinjari Chand
27 ఏప్రిల్, 2026

నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే టీసీఎస్‌ వరల్డ్‌ 10కే బెంగుళూర్ 18వ ఎడిషన్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 36,000 మందికి పైగా రన్నర్లు పాల్గొని, నగరంలో ఫిట్‌నెస్‌పై పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబించారు. ఈ రన్‌ను కర్ణాటక గవర్నర్ థావర్‌‌చంద్‌ గెహ్లట్‌ జెండా ఊపి ప్రారంభించగా, ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన రన్నర్లతో ఈ ఈవెంట్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

పరుగు తీసిన ప్రముఖులు

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్‌‌ అబ్దుల్లా తన కుమారులు జాహిద్, జమీర్‌తో కలిసి ఈ పోటీలో పాల్గొన్నారు. ఆసక్తికరంగా, ఆయన 50 నిమిషాల్లో రన్ పూర్తి చేసి, తన కుమారుల కంటే ముందుగా మారథన్‌ను ముగించారు. పరుగెత్తడం కాస్త కష్టంగా అనిపించింది. ప్రారంభంలో వేగంగా మొదలుపెట్టాను. బెంగళూరులోని తేమ ప్రభావం చూపింది. కానీ ప్రేక్షకుల ఉత్సాహం అద్భుతంగా ఉందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. మైసూరు ఎంపీ, రాజ కుటుంబ వారసుడు యదువీర్‌‌ కృష్ణదత్తా చామరాజ వడియార్‌‌ కూడా ఓపెన్ 10కే విభాగంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ నగరంలోని మారథన్‌ కమ్యూనిటీతో కలిసే మంచి అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు సమయానుకూలంగా అవసరం. 36 వేల మందికి పైగా పాల్గొనడం నగరంలో, దేశంలో రన్నింగ్ సంస్కృతి పెరుగుతున్నదానికి నిదర్శనమన్నారు. బెంగళూరు సౌత్‌ ఎంపీ తేజస్వీ సూర్య తన భార్య శివశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఆమె ఈసారి 10కే విభాగంలో తొలిసారి పాల్గొన్నారు. మొత్తంగా, ఈసారి టీసీఎస్ వరల్డ్ 10కే రన్ బెంగళూరులో ఫిట్‌నెస్‌ను జీవనశైలిగా స్వీకరించే ఉత్సాహాన్ని ప్రతిబింబించింది. వయస్సు, శారీరక పరిమితులు అడ్డంకి కాకుండా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం.