
36వ బుక్ ఎగ్జిబిషన్‌కు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విజయవాడ బుక్ ఎగ్జిబిషన్‌కు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆహ్వానించింది. 2026 జనవరి 2 తేదీన విజయవాడలో నిర్వహించనున్న ఈ 36వ బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా సొసైటీ అధ్యక్షుడు టి.మనోహర్ నాయుడు, ఏపీ ప్రింటర్లు, పబ్లిషర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కాట్రగడ్డ మోహన్ సీఎంను ఆహ్వానించారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 7 తేదీ వరకు బుక్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్టు బుక్ ఫెస్టివల్ సొసైటీ పేర్కొంది. దక్షిణ భారత దేశంలోని పుస్తక పబ్లిషర్లు, ప్రింటర్లు, పాఠకులు పెద్దఎత్తున హాజరు కానున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. అందరిలో పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగేలా బుక్ ఎగ్జిబిషన్ నిర్వహించటంపై బుక్ ఫెస్టివల్ సొసైటీని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని మంగళవారం ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆమె పలు అంశాలపై వారితో చర్చించారు. మహిళా సాధికారత దిశగా కమిషన్ భవిష్యత్ ప్రణాళికను సీఎంకు వివరించారు. అదేవిధంగా మొంథాన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్త చర్యల్లో భాగంగా గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి వైద్యసాయం అందించడంలో ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధను మహిళా కమిషన్ తరఫున ఆమె సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. చైర్ పర్సన్‌గా పదవిలోకి వచ్చిన అనతికాలంలోనే మహిళా కమిషన్‌కు మంచిపేరు తెచ్చిన రాయపాటి శైలజ ను సీఎం చంద్రబాబు అభినందించారు.
