
3.40 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం: మంత్రి శ్రీధర్‌బాబు
గత ప్రభుత్వానికి, నేటి ప్రజా ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోందని, కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా పారదర్శకమైన పాలనతో తెలంగాణను ప్రపంచ పారిశ్రామిక యవనికపై నిలబెడుతున్నామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఒకప్పుడు పెట్టుబడిదారులను వెనక్కి నెట్టిన ‘గేట్‌పాస్ కల్చర్’కు పూర్తిగా చెక్ పడిందని. నేడు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు నమ్మకంతో తెలంగాణ వైపు చూస్తున్నాయని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కేవలం కాగితాలపైనే మిగిలే భ్రమలు కావని. అవి వాస్తవ పెట్టుబడులకు, ఉద్యోగాలకు, యువతకు నిజమైన అవకాశాలకు నిదర్శనమని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో నిర్మితమవుతున్న ఆశ యాదృచ్ఛికమైనది కాదు అది ప్రణాళికాబద్ధమైన చర్యల ఫలితంగా మంత్రి పేర్కొన్నారు.
గత రెండేళ్లలోనే రాష్ట్రంలో రూ. 3.4 లక్షల కోట్ల పెట్టుబడులు భూమిపైకి వచ్చాయని, ఐటీ ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వరంగల్ టెక్స్టైల్ పార్క్ వంటి కీలక ప్రాజెక్టులు పూర్తై, పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చాయని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని కేంద్రంగా చేసుకున్న పారదర్శక పాలనను అమలు చేస్తోందని, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, వేగవంతమైన నిర్ణయాలు, అవినీతిలేని పరిపాలనతో రాష్ట్రాన్ని గ్లోబల్ ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం నిరంతరం ముందుకుసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.
