Let's talk: editor@tmv.in
పిడుగుపాటుతో 30 గొర్రెల మృతి.. రైతుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సాయం
పిడుగుపాటుతో 30 గొర్రెల మృతి.. రైతుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సాయం

పిడుగుపాటుతో 30 గొర్రెల మృతి.. రైతుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సాయం

Gaddamidi Naveen
18 మే, 2026

నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలం ఎనబెట్ల గ్రామ శివారులో శనివారం సంభవించిన పిడుగుపాటుకు 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘోర ప్రమాదంలో గొర్రెల కాపరి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే స్పందించి బాధిత రైతును పరామర్శించారు. ఆయనను ఓదార్చి, ప్రభుత్వం తరఫున పూర్తి అండగా ఉంటామని హామీ ఇస్తూ.. తక్షణ సహాయం కింద రూ.50 వేల నగదును అందజేశారు.

మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం పరిశీలన

అనంతరం మంత్రి జూపల్లి కొల్లాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మొక్కజొన్న రాశులను ఆయన నిశితంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల ధాన్యం తడిసినప్పటికీ రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్ని సైతం జిల్లా అధికారుల పర్యవేక్షణలో గోదాములకు తరలిస్తున్నామని భరోసా ఇచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి నిరంతర పర్యవేక్షణ

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మొక్కజొన్న దిగుబడి ఊహించిన దానికంటే ఎక్కువగా రావడంతో గోదాముల కొరత ఏర్పడిందని, దీనిని అధిగమించేందుకు కాటన్ గోదాములు, ప్రైవేట్ గోదాములు, అవసరమైతే ఫంక్షన్ హాళ్లను కూడా వినియోగిస్తున్నామని వివరించారు. ధాన్యం రవాణాకు లారీల కొరత లేకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని మంత్రి విమర్శించారు. దీంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు తగ్గినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం అధిక ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. హమాలీల కొరత, ఆర్థిక సమస్యలు, నిల్వ సదుపాయాల లోపం వంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పిడుగుపాటుతో 30 గొర్రెల మృతి.. రైతుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సాయం - Tholi Paluku