
30 వేల క్యూసెక్కులకు యనమదుర్రు డ్రెయిన్ సామర్థ్యం పెంపు
పశ్చిమగోదావరి జిల్లాలోని యనమదుర్రు డ్రెయిన్ సామర్థ్యాన్ని ప్రస్తుత 23 వేల క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సోమవారం అమరావతిలో ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. డ్రెయిన్‌కు ఉన్న 86 ఇన్లెట్లలో 70 శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని పునర్నిర్మించడంతో పాటు డ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
భీమవరం మీదుగా ప్రవహించే యనమదుర్రు డ్రెయిన్ ప్రస్తుతం తీవ్ర కాలుష్యానికి గురైందని మంత్రి తెలిపారు. విషపూరిత రసాయనాలతో కూడిన నల్లటి నీరు ప్రవహిస్తోందని పేర్కొన్నారు. గతంలో, ముఖ్యంగా 1990ల ప్రారంభం వరకు, భీమవరం సమీపంలోని పలు గ్రామాలకు ప్రజలు పడవల ద్వారా రాకపోకలు సాగించే స్థాయిలో డ్రెయిన్ ఉండేదని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే విడతలవారీగా 10 ఇన్లెట్లను రూ.3.2 కోట్ల వ్యయంతో పునర్నిర్మించిందన్నారు.
యనమదుర్రు డ్రెయిన్ సముద్రంలో కలిసే ఉప్పుటేరు అభివృద్ధిపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. గోదావరి డెల్టా ప్రాంతంలోని కాలువలు, డ్రెయిన్ల అభివృద్ధికి లైడార్ సర్వే పూర్తి చేసి రూ.14 కోట్లు కేటాయించామని, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన జరుగుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన 36 ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టుల క్యాలెండర్లో గోదావరి డెల్టా అభివృద్ధి కూడా ఉందని మంత్రి తెలిపారు. 2029కు ముందే మూడేళ్లలో గోదావరి డెల్టా అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
2029 నాటికి గోదావరి డెల్టా ఆధునీకరణ
గోదావరి డెల్టాలోని కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ కోసం రూ.14 కోట్లు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేశామని, ప్రస్తుతం డీపీఆర్ తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరిగేషన్ క్యాలెండర్‌ను విడుదల చేశారని, అందులో గోదావరి డెల్టా ఆధునీకరణ కూడా ఉందన్నారు. 2019–24 మధ్య అప్పటి ప్రభుత్వం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం)కు తగిన నిధులు కేటాయించకపోవడం వల్లే గోదావరి డెల్టా వ్యవస్థ దెబ్బతిందని రామానాయుడు విమర్శించారు. డీ-సిల్టింగ్, లాకులు, షట్టర్లు, రోప్స్ తదితర మరమ్మతులపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో ఓఅండ్ఎం కింద రూ.1,100 కోట్లకు పైగా నిధులు కేటాయించామని చెప్పారు.
కేశనపల్లి ప్రాజెక్ట్ అంచనాలు సిద్ధం చేస్తున్నాం
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో 2,686 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కేశనపల్లి కెనాల్ ప్రాజెక్టుకు అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కొబ్బరి పంట ఆధారిత గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకువస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాలకు మంచినీరు అందించాలనే ఉద్దేశంతో రూ.50 కోట్లతో కేశనపల్లి కెనాల్ ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు తెలిపారు. 2017–18లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన డ్రెడ్జింగ్ పనులు మినహా, ఆ తర్వాత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి పని కూడా జరగలేదని మంత్రి విమర్శించారు. డ్రైన్ల ద్వారా సముద్రపు నీరు చొచ్చుకురావడంతో వేలాది ఎకరాల్లో కొబ్బరి పంట దెబ్బతిన్నదన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, ప్రజాప్రతినిధులు శంకరగుప్తం డ్రైన్ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఇరిగేషన్ నిపుణులతో ప్రత్యక్షంగా పరిశీలన చేయడంతో పాటు మరో రెండుసార్లు సమీక్షలు నిర్వహించి రూ.21 కోట్ల నిధులు విడుదల చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారంతో ఆర్థిక శాఖ నుంచి నిధులు సాధించి పనులు చేపట్టామని చెప్పారు. శంకరగుప్తం డ్రైన్ పనులు ప్రస్తుతం 25 శాతం పూర్తయ్యాయని, మే 2027 నాటికి మిగిలిన పనులను పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
