Let's talk: editor@tmv.in
బెంగాల్ అసెంబ్లీ బరిలో 2,926 మంది అభ్యర్థులు

బెంగాల్ అసెంబ్లీ బరిలో 2,926 మంది అభ్యర్థులు

Pinjari Chand
15 ఏప్రిల్, 2026

నామినేషన్ల పర్వం, ఉపసంహరణ గడువు ముగియడంతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 2,926 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈసీఐ) మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్‌ జరగనుంది. మొదటి దశ ఓటింగ్‌ ఏప్రిల్‌ 23న, రెండో దశ ఏప్రిల్‌ 29న జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు మే 4న ప్రకటించనున్నారు.

ఈసీఐ వెల్లడించిన వివరాల ప్రకారం మొదటి దశలో 152 నియోజకవర్గాల్లో 1,478 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండో దశలో 142 నియోజకవర్గాల్లో 1,448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో దశకు నామినేషన్లు దాఖలు చేసే చివరి తేదీ ఏప్రిల్‌ 9 కాగా, నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 10న జరిగింది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఏప్రిల్‌ 13 మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం కల్పించారు. రిటర్నింగ్‌ అధికారులు తుది అభ్యర్థుల జాబితాను అధికారిక గెజిట్‌లో ప్రచురించాలని ఈసీఐ ఆదేశించింది. అలాగే నామినేషన్ పత్రాలు సహా ఎన్నికలకు సంబంధించిన అన్ని పత్రాలను సీల్డ్‌ కవర్లలో భద్రంగా నిల్వ చేయాలని సూచించింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో (ఈవీఎం) ఉపయోగించే బ్యాలెట్‌ పత్రాల్లో అభ్యర్థుల రంగు ఫోటోలు, వారి సీరియల్ నంబర్‌, గుర్తు వంటి వివరాలను చేర్చనున్నట్లు తెలిపింది. దీంతో ఓటర్లకు అభ్యర్థులను సులభంగా గుర్తించడం వీలవుతుందని పేర్కొంది.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) నాలుగోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ అక్రమ చొరబాట్లపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే బంగ్లాదేశ్ సరిహద్దు కంచె నిర్మాణానికి అవసరమైన భూమిని అందిస్తామని తెలిపారు. అలాగే పోలింగ్ సమయంలో హింసకు పాల్పడవద్దని హెచ్చరించారు.