Let's talk: editor@tmv.in
291 మంది అభ్యర్థులతో టీఎంసీ జాబితా

291 మంది అభ్యర్థులతో టీఎంసీ జాబితా

Pinjari Chand
18 మార్చి, 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ఆల్ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) 291 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగనుంది. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా, బీజేపీ తరఫున ప్రతిపక్ష నేత సువేందు అధికారి బరిలో దిగుతున్నారు. 2021లో నందిగ్రామ్‌లో జరిగిన పోరుకు కొనసాగింపుగా ఈసారి కూడా ఈ ఇద్దరి మధ్య నేరుగా హై వోల్టేజ్ పోరు నెలకొననుంది. మొత్తం 294 సీట్లలో 291 సీట్లకు టీఎంసీ పోటీ చేస్తుండగా, మిగిలిన మూడు సీట్లను మిత్రపక్షమైన భారతీయ గోర్ఖా ప్రజాతంత్రిక్‌ మోర్చా (బీజీపీఎం)కు కేటాయించింది. అనిత్ థాపా నేతృత్వంలోని ఈ పార్టీ దార్జిలింగ్, కుర్సియాంగ్, కలింపాంగ్ నియోజకవర్గాల్లో బరిలో నిలవనుంది. 226కు పైగా సీట్లు గెలుస్తామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.

75 మంది సిట్టింగ్‌లకు నో టికెట్‌

ఈసారి అభ్యర్థుల ఎంపికలో టీఎంసీ గణనీయ మార్పులు చేసింది. మొత్తం 291 మందిలో 135 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలను కొనసాగించగా, సుమారు 75 మందిని తప్పించింది. మరో 15 మందిని ఇతర నియోజకవర్గాలకు మార్చింది. దీన్ని పార్టీ వర్గాలు ‘యాంటీ ఇన్‌కంబెన్సీ మేనేజ్‌మెంట్’గా పేర్కొంటున్నాయి. పాత నాయకత్వాన్ని పూర్తిగా తొలగించకుండా, కొత్త ముఖాలను చేర్చి సంస్థాగత బలం దెబ్బతినకుండా చూసిన ‘నియంత్రిత తరం మార్పు’గా విశ్లేషకులు భావిస్తున్నారు. స్టార్ అభ్యర్థుల కంటే స్థానిక స్థాయి బలం, బూత్ మేనేజ్‌మెంట్, ఓటర్లతో అనుసంధానం ఉన్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం ఈసారి ప్రత్యేకతగా నిలిచింది. సీనియర్ మంత్రులు ఫిర్హాద్ హకీం, జావేద్‌ అహ్మద్‌ ఖాన్, అరూప్‌ బిశ్వాస్, ఇంద్రానీల్‌ సేన్, చంద్రిమా భట్టాచార్య తమ తమ స్థానాల నుంచి మళ్లీ పోటీకి దిగుతున్నారు. అయితే మాజీ మంత్రి పార్ధ ఛటర్జీతో పాటు చిరంజీత్ చక్రవర్తి, పరేశ్ పాల్‌లకు ఈసారి టికెట్లు దక్కలేదు. కొత్త ముఖాల్లో ఒలింపిక్ అథ్లెట్ స్వప్న బర్మాన్‌ను రాజ్‌గంజ్ నుంచి, మాజీ క్రికెటర్ శిబ్ శంకర్ పాల్‌ను తుఫాంగంజ్ నుంచి బరిలోకి దింపారు. నటుడు సోహం చక్రవర్తిని తేహట్టాకు మార్చగా, పార్టీ ప్రతినిధి కునాల్‌ఘోష్‌ను బెలియాఘాట నుంచి తొలిసారి పోటీకి దించారు. సామాజిక సమతుల్యతకూ ప్రాధాన్యం ఇచ్చిన టీఎంసీ 52 మంది మహిళలు, 95 మంది ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు, 47 మంది మైనారిటీ అభ్యర్థులను ఎంపిక చేసింది. నందిగ్రామ్‌లో ఈసారి పబిత్ర కార్‌ను అభ్యర్థిగా నిలబెట్టడం గమనార్హం.

అభ్యర్థుల జాబితా విడుదల అనంతరం మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్యాస్ సంక్షోభం సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ, నేరుగా పోటీకి రావాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారాలను తగ్గించిందని కూడా ఆమె ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీపై స్పందిస్తూ 2026లో మేము గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు డబ్బు కోసం కాకుండా బెంగాల్ ఆస్తిత్వం కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మొత్తంగా, స్టార్ పవర్‌కు దూరంగా, స్థానిక బలం, సామాజిక సమీకరణాలు, తరం మార్పు వంటి అంశాలను సమన్వయం చేస్తూ టీఎంసీ ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.