Let's talk: editor@tmv.in
2,861 ఎస్సై ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌

2,861 ఎస్సై ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌

Shaik Mohammad Shaffee
28 సెప్టెంబర్, 2025

పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం. ఢిల్లీ పోలీస్‌తో పాటు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్) పరిధిలోని పలు విభాగాల్లో 2,861 సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) పోస్టుల భర్తీకి ఎస్ఎస్‌సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వీటిలో ఢిల్లీ పోలీస్, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ వంటి సీఏపీఎఫ్ దళాలలో ఎస్సై పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల పురుషులు, మహిళా అభ్యర్థులు అక్టోబర్‌ 16 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా కొన్ని నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పురుషలు 170 సెంటీమీటర్లు, మహిళలు 165 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక మొత్తం నాలుగు దశల్లో ఉంటుంది. మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగానికి 50 ప్రశ్నలు, 50 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ & ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (దేహదారుఢ్య పరీక్షలు) నిర్వహిస్తారు. ఎత్తు, ఛాతీ కొలతలు, పరుగు పందెం (100మీ, 1600మీ), లాంగ్ జంప్, హై జంప్ వంటి క్రీడల్లో అభ్యర్థులు నిర్దేశిత ప్రమాణాలను తప్పనిసరిగా చేరుకోవాలి. ఇందులో పాసైన అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పేపర్-2 పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌పై ఉంటుంది. దీనికి 200 మార్కులు కేటాయించారు. ఈ ఎగ్జామ్ కూడా క్లియర్ చేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది జాబితా ప్రకటిస్తారు. పేపర్-1, పేపర్-2 పరీక్షలలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.

దరఖాస్తు విధానం

ముందుగా అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆ తర్వాత 'అప్లై' విభాగంలోకి వెళ్లి ఎస్సై పోస్టుల నోటిఫికేషన్‌ను ఎంచుకోవాలి. ముందుగా వన్-టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఆపై దరఖాస్తు ఫారమ్ నింపాలి. అవసరమైన పత్రాలు, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి, దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్థులైతే రూ.100 చెల్లించాలి (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు). ఈ ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుండి రూ.1,12,400 వరకు జీతం ఉంటుంది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఎస్ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/ను సందర్శించండి.

=

2,861 ఎస్సై ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ - Tholi Paluku