Let's talk: editor@tmv.in
28 జిల్లాలుగా ఆంధ్ర ప్రదేశ్

28 జిల్లాలుగా ఆంధ్ర ప్రదేశ్

Shaik Mohammad Shaffee
30 డిసెంబర్, 2025

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భూముల కేటాయింపు, అమరావతి రాజధాని నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఉద్యోగులు–పెన్షనర్లకు లబ్ధి, పేదల సంక్షేమం, రోడ్డు భద్రత, పోర్టులు-ఎయిర్‌పోర్టులు, అలాగే జిల్లాల పునర్విభజన అంశాలపై విస్తృతంగా చర్చించి మొత్తం 24 అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలను మంత్రులు అనగాని సత్య ప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ మీడియాకు వివరించారు.

ఏపీలో 28కి పెరిగిన జిల్లాల సంఖ్య

ఈ సమావేశంలో జిల్లాల పునర్విభజన అంశంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 17 జిల్లాల్లో మార్పులు చేస్తూ మొత్తం 25 మార్పులకు ఆమోదం తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన తరువాత ఈ మార్పులు చేసినట్టు రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. పోలవరం, మార్కాపురం అనే రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 28కి పెంచనున్నారు. ఈ మార్పులు 2025 డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

భూముల కేటాయింపు

రెవెన్యూ శాఖకు సంబంధించిన నిర్ణయాల్లో భాగంగా ఏలూరు జిల్లా నుజివీడులో దాదాపు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ స్థాపన కోసం 33 సంవత్సరాల లీజుకు కేటాయించారు. వ్యవసాయం, ఉద్యానవన రంగాల్లో నిపుణుల తయారీకి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. అలాగే కోనసీమ జిల్లా కాట్రేనికోనలో వేదాంత లిమిటెడ్‌కు ఆన్‌షోర్ డ్రిల్లింగ్ కోసం ఉన్న 9.88 ఎకరాల భూమి లీజును మరో మూడు సంవత్సరాల పాటు పునరుద్ధరించారు.

తిరుపతి జిల్లా దామినేడు గ్రామంలో 28 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని “స్పోర్ట్స్ సిటీ” ఏర్పాటు కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కు ఉచితంగా బదిలీ చేయడాన్ని క్యాబినెట్ ధృవీకరించింది. యువతకు క్రీడల్లో అవకాశాలు పెరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు తెలిపారు.

అమరావతి రాజధానికి భారీ నిధులు

అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నాబార్డ్ నుండి రూ.7,387 కోట్ల రుణం పొందేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, ఫ్లడ్ పంపింగ్ స్టేషన్లు వంటి పనులకు ఈ నిధులు ఉపయోగించనున్నారు. ఉండవల్లి వద్ద భారీ ఫ్లడ్ పంపింగ్ స్టేషన్, అలాగే ల్యాండ్ పూలింగ్ గ్రామాల్లో రోడ్లు, డ్రైన్స్, సీవరేజ్ నిర్మాణ పనులకు వేల కోట్ల విలువైన కాంట్రాక్టులకు ఆమోదం లభించింది.

అలాగే అమరావతిలో భవిష్యత్ సాంకేతిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని “అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్” నిర్మాణానికి రూ.137 కోట్లతో ఎల్ & టి సంస్థకు కాంట్రాక్టు కేటాయించారు.

మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి రూ.1,673 కోట్లతో ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఇది రెండు దశల్లో హైబ్రిడ్ అన్యూటీ మోడల్‌లో చేపట్టనున్నారు.

పేదలు, దళితులకు ఊరట

పేదలు, దళితులకు ఊరట కలిగించే నిర్ణయంగా ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కెఎఫ్‌డీసీ రుణాలపై ఉన్న రూ.41.61 కోట్ల వడ్డీ మొత్తాన్ని మాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా 11,479 మంది షెడ్యూల్డ్ కులాల లబ్ధిదారులు రుణ భారం నుంచి ఉపశమనం పొందనున్నారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్తగా 3.64 శాతం డీఏ/డీఆర్ పెంపును క్యాబినెట్ ఆమోదించింది. ఇది 2024 జనవరి 1 నుంచి వర్తించి, అక్టోబర్ 2025 జీతం నుంచి ప్రయోజనం అందనుంది.

రోడ్డు భద్రతకు కొత్త సెస్

రోడ్డు భద్రత కోసం లైఫ్ టాక్స్ వర్తించే వాహనాలపై 10 శాతం “రోడ్ సేఫ్టీ సెస్” విధించేందుకు ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. ఈ సెస్ ద్వారా సంవత్సరానికి సుమారు రూ.270 కోట్లు సమకూరుతాయని, రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ నిధులు ఉపయోగిస్తామని ప్రభుత్వం తెలిపింది.

దుగరాజుపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు

పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో భాగంగా తిరుపతి జిల్లా దుగరాజుపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు, షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు, నెల్లూరు జిల్లా దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కోసం భూసేకరణకు క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. మొత్తంగా ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పరిపాలనా సౌలభ్యం దిశగా కీలక మైలురాయిగా నిలుస్తాయని ప్రభుత్వం అభిప్రాయపడింది.

28 జిల్లాలుగా ఆంధ్ర ప్రదేశ్ - Tholi Paluku