Let's talk: editor@tmv.in
27 మున్సిపాలిటీల విలీనంతో మెగా సిటీగా అవ‌త‌రించిన మహా భాగ్యనగరం

27 మున్సిపాలిటీల విలీనంతో మెగా సిటీగా అవ‌త‌రించిన మహా భాగ్యనగరం

Gaddamidi Naveen
27 డిసెంబర్, 2025

భాగ్యనగరం మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది.హైదరాబాద్‌ మహానగరం విస్తరణతో ‘మెగా సిటీ’గా అవతరించిందని అధికారులు వెల్లడించారు. 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేయడంతో నగర పరిధి భారీగా పెరిగింది. ఈ విలీనంతో జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2,053 చదరపు కిలోమీటర్లకు విస్తరించిందని కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌ తెలిపారు.

విస్తరించిన పరిధిలో పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జీహెచ్‌ఎంసీ వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచగా, పరిపాలనా జోన్లను 6 నుండి 12కు పెరిగాయి. అలాగే సర్కిళ్ల సంఖ్యను 30 నుంచి 60కు పెంచింది. కొత్తగా ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లో జోన్లు ఏర్పాటు చేశారు.

ఈ కొత్త జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల ఏర్పాటుతో పౌర సేవలు మరింత వేగంగా, సులభంగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కమిషనర్‌ పేర్కొన్నారు. అలాగే అభివృద్ధి పనులు వేగవంతం కావడానికి ఈ పరిపాలనా మార్పులు దోహదపడతాయని అన్నారు. ఇదిలా ఉండగా, డిసెంబర్‌ 25న రాష్ట్ర ప్రభుత్వం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జయేశ్‌ రంజన్‌ను హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలోని మెట్రోపాలిటన్‌ ఏరియా అర్బన్‌ డెవలప్‌మెంట్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అలాగే జీహెచ్‌ఎంసీలోని వివిధ జోన్లకు జోనల్‌ కమిషనర్లను కూడా ప్రభుత్వం నియమించింది.

27 మున్సిపాలిటీల విలీనంతో మెగా సిటీగా అవ‌త‌రించిన మహా భాగ్యనగరం - Tholi Paluku