
26/11 ముంబై దాడుల సూత్రధారి తహవ్వుర్ రాణా కెనడా పౌరసత్వం రద్దు!
2008 ముంబై ఉగ్రదాడుల (26/11) ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన పాకిస్థాన్ సంతతి కెనడా పౌరుడు తహవ్వుర్ హుస్సేన్ రాణాకు కెనడా ప్రభుత్వం గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. రాణాకు ఉన్న కెనడా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) అధికారికంగా ప్రక్రియను ప్రారంభించింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఫిబ్రవరి 26న భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న భారత్-కెనడా సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
అసలేం జరిగింది? ఎందుకు ఈ చర్య?
తహవ్వుర్ రాణా 1997లో కెనడాకు వలస వెళ్లగా, 2001లో అతడికి పౌరసత్వం లభించింది. అయితే తాజాగా ఇమ్మిగ్రేషన్ శాఖ అతడికి పంపిన నోటీసుల ప్రకారం, ఈ పౌరసత్వం రద్దుకు ఉగ్రవాద ఆరోపణలు కారణం కాదని, అది 'తప్పుడు సమాచారం' ఇచ్చి పొందినట్లు వెల్లడైంది. 2000 సంవత్సరంలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, నాలుగు సంవత్సరాలు ఒట్టావా, టొరంటోలో నివసించినట్లు, ఆ కాలంలో కేవలం ఆరు రోజులు మాత్రమే దేశం బయట ఉన్నట్లు రానా తప్పుడు వివరాలు సమర్పించాడు.
నిజం బయటపెట్టిన కెనడా పోలీసులు
రాణా పౌరసత్వ దరఖాస్తులో పేర్కొన్న వివరాలపై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎంపీ) దర్యాప్తు చేయగా, అసలు విషయం బయటపడింది. రాణా ఆ సమయంలో కెనడాలో కాకుండా, ఎక్కువ కాలం చికాగోలో ఉన్నట్లు, అక్కడ సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పౌరసత్వానికి అవసరమైన నివాస నిబంధనలను తృప్తి పరచకపోయినా, అధికారులను తప్పుదోవ పట్టించి అతడు పౌరసత్వం పొందారని, ఇది "ఉద్దేశపూర్వకమైన మోసం" అని ఐఆర్ సీసీ పేర్కొంది.
రాణా న్యాయపోరాటం
తన పౌరసత్వాన్ని రద్దు చేయాలనే కెనడా ప్రభుత్వ నిర్ణయాన్ని తహవ్వుర్ రాణా ఫెడరల్ కోర్టులో సవాలు చేశాడు. ఈ చర్య అన్యాయమని, తన హక్కులను కాలరాసేలా ఉందని అతడి తరఫు న్యాయవాదులు కోర్టులో వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిశీలనలో ఉంది. ఒకవేళ రాణా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చాడని లేదా మోసానికి పాల్పడ్డాడని కోర్టు నిర్ధారిస్తే, అతడు తన కెనడా పౌరసత్వాన్ని శాశ్వతంగా కోల్పోవలసి వస్తుంది.
భారత్ కస్టడీలో రాణా
ప్రస్తుతం రాణా భారత్‌లో ఉన్నాడు. 26/11 దాడులకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న అతడిని, గత ఏడాది ఏప్రిల్ 10న అమెరికా నుంచి భారత్ రప్పించారు. ఎన్ఐఏ అధికారులు అతడిని కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
భారత్-కెనడా దౌత్య సంబంధాల్లో కీలక మలుపు
కెనడా పౌరసత్వ వ్యవస్థ గౌరవాన్ని కాపాడటానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. సాధారణంగా ఇలా పౌరసత్వాలను రద్దు చేయడం చాలా అరుదు, గత పదేళ్లలో ఇలాంటివి చాలా తక్కువగా జరిగాయి. అయితే ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న తహవ్వుర్ రాణా విషయంలో కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య, గత కొంతకాలంగా దెబ్బతిన్న భారత్-కెనడా దౌత్య సంబంధాలను మళ్లీ గాడిన పెట్టే దిశగా ఒక కీలక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
