Let's talk: editor@tmv.in
26/11 ముంబై ఉగ్రదాడి అమరులకు నివాళులు

26/11 ముంబై ఉగ్రదాడి అమరులకు నివాళులు

Pinjari Chand
27 నవంబర్, 2025

2008లో దేశాన్ని కుదిపేసిన ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు బుధవారం నివాళులు అర్పించారు. నగర పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పుష్పాంజలి ఘటించారు. దక్షిణ ముంబైలోని పోలీస్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న అమరవీరుల స్మారక చిహ్నం వద్ద డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌, రాష్ట్ర మంత్రి అశిష్ శెలార్‌తో పాటు డీజీపీ రష్మి శుక్లా, ముంబై పోలీస్‌ కమిషనర్ దేవెన్ భారతి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉగ్ర దాడిలో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా అమర వీరులకు శ్రద్ధాంజలి అర్పించారు.

2008 నవంబర్‌ 26న పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు 10 మంది సముద్ర మార్గం గుండా ముంబైలోకి చొరబడి వరుసగా పలుచోట్ల దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ మారణహోమంలో మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300కి పైగా గాయపడ్డారు. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ), నారిమన్ హౌస్ తదితర ప్రధాన ప్రదేశాలను టార్గెట్‌ చేశారు. ఈ ఘటన దేశ భద్రతా వ్యవస్థలో పెద్ద మార్పులకు దారితీసింది. ఈ సందర్భంగా సీఎస్ఎంటీ, కామా అల్బ్లెస్ హాస్పిటల్‌ వద్ద కూడా బాధితులకు, అమరులకి ప్రజలు నివాళులు అర్పించారు. గిర్గావ్ చౌపట్టి వద్ద అజ్మల్‌ కసబ్‌ను పట్టుకునే ప్రయత్నంలో వీర మరణం పొందిన అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తుకారాం ఓంబాలే విగ్రహం ‘ప్రేరణ స్థల్‌’కు భారీగా ప్రజలు చేరుకుని నివాళి అర్పించారు. సాయంత్రం గేట్‌వే ఆఫ్ ఇండియాలో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ ఆధ్వర్యంలో ‘నెవర్ ఎవర్’ పేరుతో స్మారక, ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. బాధితుల కుటుంబ సభ్యులు, ముంబై పౌరులు పాల్గొన్నారు.

న్యాయం కొంతే జరిగింది.. నరహంతకులు ఇంకా పాక్‌లోనే ఉన్నారు: ఉజ్జ్వల్ నికమ్

ముంబై 26/11 ఉగ్రదాడి కేసులో కొంతమేరే న్యాయం జరిగింది. కానీ అసలైన కుట్రదారులు ఇంకా పాకిస్తాన్‌లో దాగి ఉన్నారని ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు ఉజ్జ్వల్ నికమ్ తెలిపారు. 26/11 ఘటన జరిగి 17 సంవత్సరాలైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కసబ్‌కు చట్టపరమైన శిక్ష పడింది. కానీ అసలు కుట్ర చేసిన హఫీజ్ సయీద్, జకీర్ రెహ్మాన్ లఖ్వీ వంటి వారు ఇంకా పాక్ రక్షణలోనే ఉన్నారు. ఐఎస్ఐ సహకారంతో దాడి జరిగిందన్న సంగతి తెలిసిందే. వారినీ చట్టం ముందు నిలబెట్టాలి అని నికమ్ స్పష్టం చేశారు. ఆ దాడిలో పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష పడడంలో నికమ్ కీలక పాత్ర పోషించారు.

పాక్‌ నాటకాలు ఆడుతోంది

అక్కడ అరెస్ట్‌ చేశామని చెప్పే వాళ్లున్నారు. ఎనిమిది–తొమ్మిది మందిని పట్టుకున్నామని పాక్ ప్రచారం చేస్తోంది. కానీ విచారణల స్థితిగతులు ఎవరికీ తెలియడం లేదు. అంతా నాటకమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 26/11 తర్వాత ముంబైలో భద్రత విషయంలో చాలా మార్పులు వచ్చాయని, కానీ ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఆందోళన కలిగించిందని నికమ్ తెలిపారు. మనలో విభేధాలు కలిగించడమే పాక్ ఉద్దేశ్యం. మనం అంతా భారతీయులమే అన్న భావన బలపడాలి. విద్య, వాతావరణం సమానత్వాన్ని నేర్పాలి. కానీ కొందరు శాంతి భద్రతలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు.