Let's talk: editor@tmv.in
సెల్ఫ్ ఎన్యూమరేషన్‌లో 26 లక్షల కుటుంబాలు: ఆర్జీఐ

సెల్ఫ్ ఎన్యూమరేషన్‌లో 26 లక్షల కుటుంబాలు: ఆర్జీఐ

Pinjari Chand
23 ఏప్రిల్, 2026

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సెన్సస్ ప్రక్రియలో తొలి దశలోనే 26 లక్షలకుపైగా కుటుంబాలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే (సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌) సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ సంఖ్యలు డిజిటల్ విధానంపై ప్రజల్లో పెరుగుతున్న భాగస్వామ్యాన్ని సూచిస్తున్నాయని తెలిపింది.

సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఆర్జీఐ పేర్కొంటూ ఆన్‌లైన్ ద్వారా తమ వివరాలను నమోదు చేయడం ద్వారా ఈ కుటుంబాలు వేగవంతమైన, సులభమైన, స్మార్ట్ విధానాన్ని ఎంచుకుని దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యాయి. తొలి దశలో హౌస్‌లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ (హెచ్‌ఎల్‌వో) కోసం #SelfEnumeration సౌకర్యం ఎంపిక చేసిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతోందని వెల్లడించింది. స్వాతంత్ర్యం తరువాత నిర్వహిస్తున్న ఎనిమిదో సెన్సస్ ఇది. సెన్సస్ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో హెచ్‌ఎల్‌వో, రెండో దశ పాప్యులేషన్ సెన్సస్ ఉంటుంది.

ఏప్రిల్ 16 నుంచి పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో హౌసింగ్ లిస్టింగ్ కోసం ఫీల్డ్ విజిట్‌లు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నిర్మాణాలు, ఇళ్లు, కుటుంబాలను నమోదు చేసి, తదుపరి జనాభా లెక్కింపునకు బలమైన పునాది ఏర్పరచడం ఈ దశ లక్ష్యం.

ప్రత్యేక ఐడీ

ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఒక్కో రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం ఈ నెలపాటు జరిగే ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఫీల్డ్ విజిట్‌లకు ముందుగా 15 రోజుల స్వయంగా వివరాలు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో పౌరులు ప్రత్యేక పోర్టల్ ద్వారా హెచ్‌ఎల్‌వో దశ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవచ్చు. అవసరమైన వివరాలు నమోదు చేసి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తర్వాత పౌరులకు ఒక ప్రత్యేక ఐడీ లభిస్తుంది. ఆ ఐడీని ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు చూపించి ధృవీకరణ పూర్తి చేయాలి. ఈసారి సెన్సస్ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలో జరుగుతుండడం విశేషం. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించారు. ఎన్యూమరేటర్లు తమ మొబైల్ ఫోన్లలోని ఆ యాప్ ద్వారా వివరాలను సేకరిస్తారు. హౌసింగ్ లిస్టింగ్ సమయంలో ప్రతి ఇల్లు, భవనాన్ని ప్రత్యక్షంగా సందర్శించి, ఇంట్లో ఉన్న ప్రాథమిక సౌకర్యాలు, కుటుంబ యజమాని సమాచారం (పేరు, లింగం), ఇల్లు యాజమాన్య స్థితి తదితర అంశాలపై మొత్తం 33 ప్రశ్నలు అడుగుతారు. సెన్సస్ రెండో దశ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.