
24 నెలలు.. 24 మోసాలే: కూటమి పాలనపై వైఎస్ షర్మిల విమర్శలు
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రెండేళ్ల పాలనపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్.. 24 నెలలు 24 మోసాలు.. అప్పులు ఫుల్ అభివృద్ధి నిల్.. ప్రచారం పీక్స్ పరిపాలన వీక్" అంటూ కూటమి సాధించిన ఘనత ఇదేనని ఆమె తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఎద్దేవా చేశారు.
అబద్ధపు మాటలతో మేనిఫెస్టోపై మాట తప్పి, అభివృద్ధి జరిగిందంటూ విజయోత్సవ సభలు పెట్టడానికి కూటమి పార్టీలకు సిగ్గుండాలని షర్మిల నిప్పులు చెరిగారు. రెండేళ్లుగా ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోలేదని, మహిళలకు నెలకు రూ. 1500 ఇచ్చే ‘మహిళాశక్తి’ పథకానికి దిక్కులేదన్నారు. 20 లక్షల ఉద్యోగాల జాడ లేదని, నిరుద్యోగ భృతి రూ. 3 వేలు ఇవ్వడం లేదని ఆరోపించారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మూడు సిలిండర్ల హామీలన్నీ సగం సగమేనని విమర్శించారు.
మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారని, 30 శాతం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి రూ. 15,000 కోట్ల భారం మోపారని ధ్వజమెత్తారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేవని, ధరల స్థిరీకరణ జరగలేదని, పోలవరం, జలయజ్ఞం ప్రాజెక్టులను గాలికొదిలేశారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ. 7,000 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ. 3,000 కోట్ల బకాయిలు పెట్టారన్నారు. పేదలకు ఇండ్లు, భూములు ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని అటకెక్కించారని ఆరోపించారు.
రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, కేంద్ర నిధుల గురించి మాట్లాడకుండా ప్రధాని మోడీ భజన చేస్తున్నారు. మతాల మధ్య విభజన తెస్తూ, రాష్ట్రాన్ని మరో రూ. 3.50 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిన కూటమి పాలన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
