Let's talk: editor@tmv.in
24న జగన్ కీలక సమావేశం

24న జగన్ కీలక సమావేశం

FL - SIMHCLM
23 సెప్టెంబర్, 2025

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో ఈనెల 24న కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. వాస్తవానికి ఇటీవల రాష్ట్రంలో జరిగిన పలు పరిణామాలు అధికార తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టగా, అవి ప్రతిపక్ష వైసీపీకి అనుకూలంగా మారినట్లు చెబుతున్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఉల్లి, మిర్చి, పొగాకు, మామిడి రైతులు ధరలేక పూర్తిగా నష్టాల పాలవడం మరోవైపు యూరియా కోసం రైతులు గంటలతరబడి క్యూ లైన్లలో నిలబడి అవస్థలు పడుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, గొడవలు కూడా జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగానే మరోవైపు మెడికల్ కాలేజీలను పీపీపీకి ఇస్తాం అంటూ చంద్రబాబు చేసిన ప్రకటన కూడా రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. దీన్ని వైఎస్ జగన్ ఆ పార్టీ నాయకులు జనంలోకి తీసుకెళ్లారు. మరోవైపు మేము కట్టిన, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ కాలేజీలను చంద్రబాబు ఎలా ప్రయివేటుకు ఇస్తారు అంటూ ఆందోళన చేయడమే కాకుండా అదే కాలేజీల వద్ద మొన్న రెండో వార్షికోత్సవం అంటూ కేకులు కూడా కట్ చేసారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎప్పటికీ ప్రయివేటు మనిషే అన్న అభిప్రాయం ప్రజల్లోకి పంపేందుకు వైయస్ జగన్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా శాసన సభకు వైయస్ జగన్ వెళ్లకపోవడం కూడా రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఇన్ని కీలకాంశాలు ఉన్న నేపథ్యంలో వైయస్ జగన్ ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశం ఏమి నిర్ణయాలు తీసుకుంటుందో అని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

24న జగన్ కీలక సమావేశం - Tholi Paluku