Let's talk: editor@tmv.in
బంగ్లాదేశ్‌లో యూనస్ ప్రభుత్వం నాటి 23 కీలక ఆర్డినెన్స్‌ల రద్దు

బంగ్లాదేశ్‌లో యూనస్ ప్రభుత్వం నాటి 23 కీలక ఆర్డినెన్స్‌ల రద్దు

Shaik Mohammad Shaffee
24 ఏప్రిల్, 2026

బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థుల పోరాట ఫలంతో ఏర్పడిన మొహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక సంస్కరణలకు ప్రస్తుత తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని ఎన్నికైన ప్రభుత్వం చెక్ పెట్టింది. యూనస్ హయాంలో జారీ చేసిన సుమారు 23 కీలక ఆర్డినెన్స్‌లు తాజాగా తమ చట్టబద్ధతను కోల్పోయాయి. వీటిలో కొన్నింటిని ప్రభుత్వం కావాలనే రద్దు చేయగా, మరికొన్ని పార్లమెంటు ఆమోదం పొందక కాలం చెల్లిపోయాయి.

విద్యార్థి ఉద్యమం నుండి ఎన్నికల వరకు..

2024లో షేక్ హసీనా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చెలరేగిన విద్యార్థి ఉద్యమం బంగ్లాదేశ్ ముఖచిత్రాన్ని మార్చేసింది. హసీనా రాజీనామా చేసి భారత్‌కు పారిపోవడంతో, నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. వ్యవస్థల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఆయన 133 ఆర్డినెన్స్‌లను తీసుకొచ్చారు. అయితే 2026 ఫిబ్రవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 'బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ' ఘనవిజయం సాధించి, తారిఖ్ రెహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

పార్లమెంటులో వీగిపోయిన కీలక చట్టాలు

బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం, మధ్యంతర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌లను కొత్త పార్లమెంటు కొలువుదీరిన 30 రోజుల్లోపు ఆమోదించాల్సి ఉంటుంది. మార్చి 2026లో పార్లమెంటు సమావేశమైనప్పటి నుండి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 133 ఆర్డినెన్స్‌లను సమీక్షించగా, అందులో 110 ఆర్డినెన్స్‌లకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మిగిలిన 23 ఆర్డినెన్స్‌లు రద్దయ్యాయి. ఇందులో ఏడు ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం అధికారికంగా రద్దు చేయగా, మరో 16 ఆర్డినెన్స్‌లను ఓటింగ్‌కు పెట్టకుండా వదిలేయడంతో అవి వాటంతట అవే కాలం చెల్లిపోయాయి.

రద్దయిన కీలక సంస్కరణలు ఇవే

బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం రద్దు చేసిన వాటిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన చట్టాలు ఉన్నాయి. ప్రధానంగా దేశంలో అవినీతిని అరికట్టే పటిష్టమైన నిబంధనలు, గతంలో అక్రమంగా జరిగిన అపహరణలు, అదృశ్యాలపై విచారణ జరిపే కీలక యంత్రాంగాలు ఇప్పుడు రద్దయ్యాయి. వీటితో పాటు పోలీసుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ వారిని ప్రజలకు జవాబుదారీగా చేసే సంస్కరణలు, కోర్టుల్లో జడ్జీల నియామకాల్లో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా ఉండేలా తెచ్చిన న్యాయవ్యవస్థ మార్పులు కూడా ఈ రద్దుతో నిలిచిపోయాయి. దీనివల్ల ప్రభుత్వ సంస్థలపై రాజకీయ ఒత్తిడి పెరిగి, పారదర్శకత తగ్గుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మండిపడుతున్న విపక్షాలు, విద్యార్థి నేతలు

ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా షేక్ హసీనాను గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన 'నేషనల్ సిటిజన్స్ పార్టీ' ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మాజీ మంత్రి, విద్యార్థి నేత నాహిద్ ఇస్లాం ఆధ్వర్యంలో అక్తర్ హుస్సేన్, అసిఫ్ మహమూద్, సర్జీస్ ఆలం వంటి నేతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. కీలక చట్టాలను రద్దు చేయడం వల్ల ప్రభుత్వ సంస్థల్లో రాజకీయ జోక్యం పెరుగుతుందని, పారదర్శకత లోపిస్తుందని హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రభుత్వ సమర్థన

మరోవైపు, ప్రధాని తారిఖ్ రెహమాన్ సర్కార్ ఈ పరిణామాలను సమర్థించుకుంటోంది. ఇది కేవలం సాంకేతిక ప్రక్రియ మాత్రమేనని, ఆయా చట్టాల్లోని లోపాలను సరిదిద్ది, అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత మరింత పటిష్టమైన చట్టాలను మళ్ళీ తీసుకొస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే పాత చట్టాల రద్దు వెనుక రాజకీయ ప్రతీకార వాంఛ ఉందన్న విమర్శలు మాత్రం ఆగడం లేదు.