Let's talk: editor@tmv.in
23 ఏళ్ల తర్వాత భారత్‌లో ఫిడే ప్రపంచ కప్

23 ఏళ్ల తర్వాత భారత్‌లో ఫిడే ప్రపంచ కప్

Shaik Mohammad Shaffee
28 అక్టోబర్, 2025

ప్రపంచ చదరంగ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక ఈవెంట్‌లలో ఒకటైన ఫిడే ప్రపంచ కప్‌కు సుమారు 23 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా టోర్నమెంట్‌కు గోవా వేదిక కానుంది. అక్టోబర్ 31 నుండి నవంబర్ 27 వరకు ఉత్తర గోవా రిసార్ట్‌లో ఈ టోర్నమెంట్ జరగనుంది. మొత్తం ప్రైజ్ మనీ 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.16.6 కోట్లు)గా నిర్ణయించారు.

భారత చదరంగ కీర్తిని ఇనుమడింపజేసిన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డి.గుకేశ్ ఈ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనున్నారు. 19 ఏళ్ల ఈ సంచలన ఆటగాడు, తాను గతంలో జూనియర్ ఈవెంట్‌లు ఆడిన గోవాకు అగ్రశ్రేణి సీడ్‌గా తిరిగి వస్తుండటం విశేషం.

"వరల్డ్ కప్ గురించి నేను నిజంగా ఉత్సాహంగా ఉన్నాను. భారతదేశంలో ఎక్కడ ఆడినా అది ఎప్పుడూ ప్రత్యేకమే, ముఖ్యంగా గోవాతో నాకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అక్కడికి మళ్లీ వెళ్లడానికి ఎదురుచూస్తున్నాను" అని గుకేశ్ తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. 2019లో గోవా అంతర్జాతీయ ఓపెన్‌లో పాల్గొన్న గుకేశ్, ఇప్పుడు విశ్వ చాంపియన్‌గా రావడం, గోవాకు మరొక చారిత్రక ఘనతగా నిలవనుంది.

టోర్నమెంట్ స్వరూపం

ఫిడే ప్రపంచ కప్ టోర్నీ పూర్తిగా నాకౌట్ ఫార్మాట్‌లో ఫార్మాట్‌లో జరుగుతుంది. ఈ పోటీలో 82 దేశాల నుండి 206 మంది చెస్‌ క్రీడాకారులు పాల్గొంటారు. మొత్తం 8 రౌండ్లు జరుగుతాయి. క్రీడాకారులు ప్రతి రౌండ్‌లో రెండు ఆటలు ఆడతారు. ఓడిపోయిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తారు. ఒక్కో రౌండ్ మూడు రోజుల పాటు జరగుతుంది. మ్యాచ్‌లోని తొలి 40 ఎత్తులకు 90 నిమిషాలు కేటాయిస్తారు. ఆ తర్వాత మిగిలిన ఆటకు 30 నిమిషాలు మాత్రమే ఇస్తారు. అలాగే ఆటగాళ్లు ఎత్తులు వేసేందుకు తీసుకునే సమయాన్ని బట్టి ప్రతి ఎత్తుకు 30 సెకెన్ల ఇంక్రిమెంట్ కూడా పొందుతారు. ఈ టోర్నమెంట్‌లో టాప్ మూడు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు 2026 కాండిడేట్స్ టోర్నమెంట్‌కు నేరుగా అర్హత సాధిస్తారు. ప్రపంచ ఛాంపియన్‌గా గుకేశ్‌కు మొదటి రౌండ్‌లో 'బై' లభించింది. ఆయన రెండవ రౌండ్‌లో కజకిస్థాన్‌కు చెందిన కజిబెక్ నోగెర్‌బెక్తో తలపడే అవకాశం ఉంది.

అంతర్జాతీయ స్టార్ల సవాల్

ఈ పోటీలో డచ్ గ్రాండ్‌మాస్టర్ అనిష్ గిరితో సహా పలువురు అంతర్జాతీయ స్టార్లు విజేత టైటిల్‌పై దృష్టి పెట్టారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లలో ఒకరైన అనిష్ గిరి, అత్యధిక ర్యాంకు కలిగిన విదేశీ ఆటగాడిగా బరిలోకి దిగనున్నారు. గిరి మాట్లాడుతూ, "ఈ వరల్డ్ కప్ ఒక గొప్ప ఈవెంట్. అర్హతతో సంబంధం లేకుండా నేను ఆడుతున్నాను. ఇది సవాలుగా ఉంటుంది. కానీ చాలా సరదాగా ఉంటుంది" అని తెలిపారు. 2015లో సెమీ-ఫైనల్‌లో పీటర్ స్విడ్లర్‌తో ఓడిపోయి, క్వాలిఫై అవ్వడానికి దగ్గరగా వచ్చిన అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

భారత విజేతలు

ఫిడే ప్రపంచ కప్ 2005 నుండి నాకౌట్ ఫార్మాట్‌ను అనుసరిస్తోంది. ఇప్పటివరకు భారతదేశానికి చెందిన విశ్వనాథన్ ఆనంద్, అర్మేనియాకు చెందిన లెవోన్ అరోనియన్ మాత్రమే ఈ టైటిల్‌ను చరిత్రలో రెండుసార్లు గెలుచుకున్నారు.

భారత్‌లో చివరిసారి 2002లో హైదరాబాద్‌లో చెస్ ప్రపంచ కప్‌ జరిగింది. ఆ తర్వాత చెస్‌కు సంబంధించి కొన్ని మెగా టోర్నీలు జరిగాయి కానీ, ప్రపంచకప్ మాత్రం ఇప్పటివరకు జరగలేదు. 2022లో చెస్ ఒలంపియాడ్, 2024లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్, 2025 ఏప్రిల్‌లో ఉమెన్స్ గ్రాండ్ ఫ్రిక్స్ మొదలైన టోర్నీలు జరిగాయి. అక్టోబర్‌లో చెస్ వరల్డ్ కప్ జరగబోతోంది.

23 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ భారత గడ్డపై జరుగుతుండటం, దేశంలో చదరంగ క్రీడకు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని, యువ క్రీడాకారులకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. గుకేశ్ తన విజయ ప్రస్థానంలో గోవాలో మరోసారి తన సత్తా చాటాలని యావత్ దేశం ఎదురుచూస్తోంది.