
22ఏ సమస్యపై ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం చూపాలి: మంత్రి పొంగులేటి
22ఏ నిషేధిత భూముల సమస్యలపై ప్రజలకు పూర్తి భరోసా కల్పించేలా చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును కేవలం దరఖాస్తుగా కాకుండా బాధ్యతగా తీసుకుని, పరిష్కారం లభించే వరకు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
బుధవారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో 22ఏ అంశంపై ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు వస్తున్న ఫిర్యాదులు, వాటి పరిష్కారం, ఎక్కువగా నమోదవుతున్న సమస్యలు, ప్రజలకు అందిస్తున్న సమాచారంపై మంత్రి సమీక్షించారు. నాలుగు జిల్లాల్లో 22ఏ అంశంపై పరిస్థితి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సుమారు 400 కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, దరఖాస్తుదారుడి పూర్తి వివరాలను సంబంధిత తహసీల్దార్, ఆర్డీవో, సబ్‌రిజిస్ట్రార్ తదితర అధికారులకు వెంటనే పంపించాలని మంత్రి ఆదేశించారు. ఫిర్యాదుపై అధికారులు తక్షణమే స్పందించి, భూమి 22ఏ జాబితాలోకి ఎందుకు చేరింది, దరఖాస్తుదారుడికి అర్హత ఉందా, సమస్య వాస్తవమా అనే అంశాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అనంతరం స్పష్టమైన కారణాలతో నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
ప్రజలు సమస్యను వివరించిన తర్వాత పరిష్కారం కోసం మళ్లీ మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే సబ్‌రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్ల స్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు తాజాగా వచ్చిన వాటినీ వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. 22ఏ సమస్యను ప్రత్యేక టాస్క్‌గా తీసుకుని రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిజమైన హక్కుదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
