Let's talk: editor@tmv.in
కొడంగల్‌లో 22 వేల నకిలీ ఓట్లు.. సీఎం గెలుపుపై ఈసీ ఫేవర్ చేసిందా?: కవిత సంచలన వ్యాఖ్యలు

కొడంగల్‌లో 22 వేల నకిలీ ఓట్లు.. సీఎం గెలుపుపై ఈసీ ఫేవర్ చేసిందా?: కవిత సంచలన వ్యాఖ్యలు

Gaddamidi Naveen
30 జూన్, 2026

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక స‌మ‌గ్ర‌ సవరణ (స‌ర్) ప్రక్రియపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం (ఈసీ) తీరుపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో జరిగిన ఓట్ల అక్రమాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బోధన్ నియోజకవర్గంలో కేవలం ఏడాదిన్నర కాలంలోనే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సుమారు 7,000 ఓట్లను ఈసీ తొలగించిందని కవిత ఆరోపించారు. ఈసీ నిబంధనల ప్రకారం ఒక నియోజకవర్గంలో 2 శాతం కంటే ఎక్కువ ఓట్లు తొలగించాల్సి వస్తే ప్రతి ఓటరుకు మూడుసార్లు నోటీసులు ఇవ్వాలని, కానీ బోధన్‌లో ఆ నిబంధనను తుంగలో తొక్కారని మండిపడ్డారు.

కొడంగల్‌లో ‘కర్ణాటక’ ఓటర్ల కలకలం

బోధన్ పరిస్థితి చూశాక తాము కొడంగల్ నియోజకవర్గ ఓటర్ల జాబితాను పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయని కవిత తెలిపారు. బోధన్‌లో 7 వేల ఓట్లు తొలగిస్తే, సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో కేవలం 808 ఓట్లు మాత్రమే డిలీట్ చేశారు. కొడంగల్‌లో ఏకంగా 22,433 నకిలీ ఓట్లు ఉన్నాయి. వీటికి తోడు, కర్ణాటకలోని పక్క నియోజకవర్గమైన 'సెడం' నుంచి 11,000 మంది ఓటర్లు ఇక్కడ కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ నకిలీ ఓట్లు, ఇంటర్-స్టేట్ ఓట్ల మొత్తం సంఖ్య (33 వేలు) సరిగ్గా సీఎం రేవంత్ రెడ్డి గెలుపు మెజార్టీకి సమానంగా ఉందని క‌విత అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల సంఘం ముఖ్యమంత్రికి ఏమైనా ఫేవర్ చేసిందా? కర్ణాటక నుంచి తెలంగాణకు కేవలం డబ్బులే కాదు, ఓట్లు కూడా ట్రాన్స్ ఫర్ చేశారా? అని క‌విత ప్ర‌శ్నించారు.

సాధారణంగా ప్రతి ఏటా నిర్వహించే ఓటర్ల సవరణకు ప్రస్తుత ఏడాది జనవరి 1ని రిఫరెన్స్ పాయింట్‌గా తీసుకుంటారని, కానీ ఈ ఎస్ఐఆర్ కోసం 2025 జనవరి 1ని రిఫరెన్స్ పాయింట్‌గా తీసుకోవడం వెనుక ఉన్న మర్మమేంటని కవిత ప్రశ్నించారు. వేర్వేరు రాష్ట్రాల మధ్య ఓట్ల నకిలీల‌ను ఏరివేసే బలమైన మెకానిజం ఈసీ వద్ద లేనప్పుడు, రూ. 1,400 కోట్లు ఖర్చు చేసి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడం వృధా అని విమర్శించారు.

దేశంలో "వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు" విధానం ఖచ్చితంగా ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంటర్-స్టేట్ మైగ్రేషన్ ఓట్లను అరికట్టాలని, దేశంలోని సంచార జాతుల ఓట్ల నమోదుపై స్పష్టత ఇవ్వాలని, అలాగే ఒకే ఇంట్లోని వారందరికీ ఒకే బూత్‌లో ఓటు ఉండేలా చూడాలని కోరారు. మాలాంటి సరికొత్త పార్టీలకు పారదర్శకమైన ఓటర్ల జాబితా అత్యంత కీలకమని పేర్కొన్న కవిత.. తాము లేవనెత్తిన ప్రశ్నలన్నింటికీ ఎన్నికల సంఘం తక్షణమే స్పష్టమైన సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు
KavithaTelanganaRakshanaSenaTRSKodangalBodhanRevanthReddyElectionCommissionECIVoterListDuplicateVotesSIRElectoralRoll
కొడంగల్‌లో 22 వేల నకిలీ ఓట్లు.. సీఎం గెలుపుపై ఈసీ ఫేవర్ చేసిందా?: కవిత సంచలన వ్యాఖ్యలు - Tholi Paluku