
22ఏ పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు: హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ సెక్షన్ పేరుతో భూములను అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎవరి భూమి 22ఏ జాబితాలో ఉందో, ఎవరిది లేదో తెలియక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. 1999లో దేశవ్యాప్తంగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని రద్దు చేశారని, తెలంగాణలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ చట్టాన్ని పూర్తిగా ఎత్తివేశారని గుర్తుచేశారు. సీలింగ్ పరిధి నుంచి బయటపడి, గతంలో క్లియర్ అయిన భూములను కూడా ఇప్పుడు తిరిగి సీలింగ్ యాక్ట్ కింద 22ఏలో చేర్చడం ఏ విధమైన న్యాయమని ప్రశ్నించారు.
రాత్రికి రాత్రే నిషేదిత జాబితాలోకి
ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి ప్రభుత్వ భూములను సైతం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని హరీశ్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌లోని లక్షలాది ప్రాపర్టీలను రాత్రికి రాత్రే ప్రొహిబిషన్ లిస్ట్‌లో చేర్చారని, శ్రీనగర్ కాలనీలోని సర్వే నంబర్లు 8, 9లో ఏళ్లుగా నివసిస్తున్న వారి ఇళ్లను కూడా 22ఏలో పెట్టారని పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్ ఫ్లాట్లను నిషేధిత జాబితాలో చేరిస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ కోసం చలాన్లు కట్టి, డబ్బులు చెల్లించిన తర్వాత చివరి దశలో భూమి 22ఏలో ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నారని ఆరోపించారు. చలాన్ రూపంలో చెల్లించిన డబ్బులను కూడా తిరిగి ఇవ్వడం లేదని అన్నారు. గతంలో ప్రభుత్వం ఎన్‌ఓసీలు ఇచ్చిన భూములకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయని, ఇప్పుడు అదే భూములను 22ఏలో చేర్చడంతో ప్రజలతో పాటు బ్యాంకులు కూడా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు.
రెవెన్యూ శాఖలో 22ఏ నుంచి భూములను తొలగించేందుకు 30 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం కూడా 22ఏ ప్రొహిబిషన్ లిస్ట్‌లో ఉందని చెబుతూ, సామాన్యుల భూముల సమస్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. డిసెంబర్ 7, 2023 నుంచి భూములను ప్రొహిబిషన్ లిస్ట్‌లో చేర్చిన వివరాలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తప్పుగా చేర్చిన భూములను తక్షణమే 22ఏ జాబితా నుంచి తొలగించాలని కోరారు.
రైతు బీమాపై ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్‌రావు
రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతోందని హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్ పోరాటం కారణంగానే జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ సమావేశాలు వాయిదా పడ్డాయని పేర్కొన్నారు. అయితే సమావేశాలు వాయిదా వేయడం మాత్రమే కాకుండా తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టుల అంశాలను ఎజెండా నుంచి పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బీమా పథకం 42.15 లక్షల మంది రైతులకు భరోసా ఇచ్చిందని చెప్పారు. ఆగస్టు 13 నుంచి ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసిందని ఆరోపించారు. కొత్తగా ప్రభుత్వం తీసుకురానున్న బీమా పథకం వల్ల 13 లక్షల మంది రైతులు బీమాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. పాత రైతు బీమా పథకాన్నే యథాతథంగా కొనసాగించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోందని తెలిపారు.
రైతుబంధుపైనా విమర్శలు
రైతుబంధు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు తప్పుడు లెక్కలు చెబుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం రూ.14,743 కోట్లు రైతుబంధు కింద అందించిందని, 2024-25లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5,057 కోట్లు మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు. 2025లో రూ.11,800 కోట్లు ఇచ్చారని, దీంతో రైతుబంధు నిధుల్లో భారీగా కోత పడిందని ఆరోపించారు. ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా, పెంచి ఇచ్చామని చెప్పడం ముఖ్యమంత్రికి తగదని విమర్శించారు. ప్రభుత్వాలు మారినా గత ప్రభుత్వాలు అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించాలన్న కనీస బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు.
