Let's talk: editor@tmv.in
22ఏ నిషేధిత భూముల పేరుతో ప్రజలను వేధిస్తున్నారు: హరీశ్‌రావు

22ఏ నిషేధిత భూముల పేరుతో ప్రజలను వేధిస్తున్నారు: హరీశ్‌రావు

Gaddamidi Naveen
27 ఆగస్టు, 2026

కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో 22ఏ నిషేధిత భూముల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరై బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

22ఏ ఆంక్షలను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో ప్రభుత్వం స్పష్టం చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, రవాణా, ఉద్యోగాలు, రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం.. ప్రజల భూముల సమస్యల చుట్టూ ఎందుకు తిరుగుతోందని ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలే కేంద్రంగా పాలన సాగిందని, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత భూములే కేంద్రంగా పాలన కొనసాగుతోందని విమర్శించారు.

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో విద్యుత్, తాగునీరు, సాగునీరు, ట్రాఫిక్ వంటి సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారాలు చూపించామని చెప్పారు. ప్రతి ఇంటికి తాగునీరు, 24 గంటల విద్యుత్ అందించడంతో పాటు హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అనేక ఫ్లైఓవర్లు నిర్మించామని తెలిపారు. నగర బ్రాండ్ ఇమేజ్‌ను పెంచి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా అభివృద్ధి చేపట్టామని పేర్కొన్నారు.

కూకట్‌పల్లిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రిజర్వాయర్లు, పైప్‌లైన్లు, ఇతర మౌలిక వసతులు నిర్మించామని హరీశ్‌రావు తెలిపారు. నగరంలో టిమ్స్ ఆసుపత్రులు, కూకట్‌పల్లిలో 20కి పైగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలను చేరువ చేశామని చెప్పారు. కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, మిషన్ భగీరథ, 24 గంటల విద్యుత్, సాగునీటి వంటి పథకాలు బీఆర్‌ఎస్ పాలనకు గుర్తులని అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కంటే ప్రభుత్వ భూముల విక్రయానికే ప్రాధాన్యత ఇస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. హౌసింగ్ బోర్డు, టీజీఐఐసీ తదితర ప్రభుత్వ భూములను విక్రయానికి పెడుతోందని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ పాలనలో హౌసింగ్ బోర్డు భూములను విక్రయించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు విక్రయించిందని ఆరోపించారు.

మరోవైపు అసైన్డ్ భూములపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని, పేదలు కష్టపడి కొనుగోలు చేసిన భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. ప్రభుత్వ భూములు భవిష్యత్ తరాల ఆస్తులని, వాటిని విక్రయించకూడదని స్పష్టం చేశారు. 22ఏ బాధితుల పక్షాన, సామాన్యుల ఆస్తుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని హరీశ్‌రావు ప్రకటించారు.