Let's talk: editor@tmv.in
2047 నాటికి ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: రామ్మోహన్ నాయుడు

2047 నాటికి ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: రామ్మోహన్ నాయుడు

Panthagani Anusha
8 ఫిబ్రవరి, 2026

ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కఠోర శ్రమతో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్ఘాటించారు. శనివారం రాజమహేంద్రవరంలోని మంజీరా కన్వెన్షన్ హాల్‌లో 2026-27 కేంద్ర బడ్జెట్‌పై నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని సంయుక్త కృషితో ఏపీ రూపురేఖలు మారబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.

ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

ఒకప్పుడు బలహీనమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం నేడు ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ స్థిరంగా 7 శాతం వృద్ధి రేటును సాధిస్తోందని వెల్లడించారు. 2026-27 బడ్జెట్ కేవలం అంకెలే కాదని లక్షలాది మంది యువత ఆకాంక్షలకు ప్రతిరూపమని ఆయన కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను రూపొందించారని తెలిపారు.

యువతకు పెద్దపీట.. రాష్ట్రానికి భారీ కేటాయింపులు

యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా తయారీ రంగం, బయోఫార్మా, ఐటీ, క్రీడా పరికరాల తయారీ రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చినట్లు రామ్మోహన్ నాయుడు వివరించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారనున్న రేర్ ఎర్త్ మాగ్నెట్ కారిడార్, హైస్పీడ్ రైల్వే కారిడార్ల ఏర్పాటుతో రాష్ట్ర పారిశ్రామిక స్వరూపం మారుతుందన్నారు. ఉడాన్ పథకం ద్వారా విమాన ప్రయాణాన్ని సామాన్యుడికి చేరువ చేశామని దేశీయంగా విమానాల తయారీకి ప్రోత్సహించేందుకు విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు.

అమరావతి, పోలవరంపై కేంద్రం ప్రత్యేక దృష్టి

రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణం, విశాఖ రైల్వే జోన్ పనులకు కేంద్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో అందుబాటులో ఉన్న సహజ వనరుల ఆధారంగా స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

2047 నాటికి ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: రామ్మోహన్ నాయుడు - Tholi Paluku