Let's talk: editor@tmv.in
2035 నాటికి 3.07 లక్షల మెగావాట్లకు చేరనున్న థర్మల్ విద్యుత్ సామర్థ్యం

2035 నాటికి 3.07 లక్షల మెగావాట్లకు చేరనున్న థర్మల్ విద్యుత్ సామర్థ్యం

Dantu Vijaya Lakshmi Prasanna
10 ఫిబ్రవరి, 2026

దేశవ్యాప్తంగా శరవేగంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తాజాగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం, 2034-35 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో థర్మల్ (బొగ్గు, లిగ్నైట్) విద్యుత్ స్థాపిత సామర్థ్యం 3,07,000 మెగావాట్లకు చేరుకోవాలని అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఉన్న 2,11,855 మెగావాట్ల సామర్థ్యంతో పోలిస్తే, ఇది భారీ వృద్ధిని సూచిస్తోంది. భవిష్యత్తులో గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడుతూ నిరంతర విద్యుత్ సరఫరాను అందించడమే లక్ష్యంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ దిశగా అడుగులు వేస్తోంది.

ఈ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం అదనంగా కనీసం 97,000 మెగావాట్ల కొత్త బొగ్గు ఆధారిత ప్లాంట్లను నిర్మించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ వివిధ దశల్లో వేగంగా సాగుతోంది. ఏప్రిల్ 2023 నుండి జనవరి 20, 2026 మధ్య కాలంలోనే ఇప్పటికే 17,360 మెగావాట్ల సామర్థ్యం అందుబాటులోకి రాగా, మరో 39,545 మెగావాట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో చిక్కుల్లో ఉన్న ప్రాజెక్టుల పునరుద్ధరణ కూడా ఉండటం గమనార్హం. ఇవి కాకుండా మరో 22,920 మెగావాట్ల ప్రాజెక్టులకు కాంట్రాక్టులు ఇవ్వగా, 24,020 మెగావాట్ల ప్లాంట్లు ప్రణాళికా దశలో ఉన్నాయి.

విద్యుత్ ఉత్పత్తి ఖర్చుల విషయానికొస్తే, పాత ప్లాంట్ల కంటే కొత్త ప్లాంట్ల ధర కొంత అధికంగా ఉండనుంది. గత మూడేళ్లలో పాత బొగ్గు ప్లాంట్ల సగటు విక్రయ ధర యూనిట్‌కు రూ. 4.36 నుండి రూ. 4.58 మధ్య ఉండగా, 2025లో జరిగిన బిడ్డింగ్‌లో కొత్త థర్మల్ ప్రాజెక్టుల ధర యూనిట్‌కు రూ. 5.38 నుండి రూ. 6.30 వరకు నమోదైంది. బొగ్గు గనులకు ప్లాంట్లు ఎంత దూరంలో ఉన్నాయి, అవి ఏ రకమైన సాంకేతికతను (సూపర్ క్రిటికల్ వంటివి) వాడుతున్నాయి అనే అంశాలపై ఈ ధరలు ఆధారపడి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరోవైపు, పర్యావరణ హితమైన పునరుద్ధరణ ఇంధన వనరుల వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఆగస్టు 2024లో జరిగిన బిడ్డింగ్‌లో ఫిర్మ్ అండ్ డిస్పాచబుల్ రిన్యూవబుల్ ఎనర్జీ ధర యూనిట్‌కు రూ.4.98 - రూ.4.99 గా నమోదైంది. థర్మల్ పవర్, ఎఫ్.డి.ఆర్.ఈ విద్యుత్ ధరలు దాదాపు సమానంగా కనిపిస్తున్నప్పటికీ, వాటి నిర్వహణ విధానం, ఇంధన లభ్యత, గ్రిడ్ అవసరాల దృష్ట్యా రెండింటినీ నేరుగా పోల్చలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ ఇంధన భద్రతలో రెండూ కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం, 2031-32 నాటికి బొగ్గు ఆధారిత ప్లాంట్ల పనితీరు 61 శాతంగా ఉండనుంది. సౌర, పవన విద్యుత్ అందుబాటులో లేని సమయాల్లో కూడా గ్రిడ్ కుప్పకూలకుండా బ్యాకప్‌గా ఈ థర్మల్ ప్లాంట్లు అత్యంత అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ నాయక్ ఈ సమగ్ర వివరాలను లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు.