Let's talk: editor@tmv.in
2035 నాటికి 1ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ: మంత్రి పొంగులేటి

2035 నాటికి 1ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ: మంత్రి పొంగులేటి

Gaddamidi Naveen
7 డిసెంబర్, 2025

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలికలు దాటి, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే విధంగా వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేస్తోంది. ఈ దిశగా డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 రాష్ట్ర ప్రతిష్టకు ప్రతీకగా నిలవబోతోంది.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించడానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులతో కూడిన బృందం శ‌నివారం వేదికను సందర్శించి చివరి దశ పనులను సమీక్షించిందని తెలిపారు. ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని ఎక్కువ భాగం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకుంటున్న దీర్ఘకాలిక నిర్ణయాలను ప్రపంచ ముందుకు తీసుకెళ్లే అవకాశంగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన వ్యూహ పథకాలను ఈ వేదికపై ప్రదర్శించనుందని అన్నారు. గత రెండు సంవత్సరాల్లో రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మిట్‌లో వివరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన పరిశ్రమల నాయకులు, ఆర్థిక నిపుణులు, సాంకేతిక రంగ ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆహ్వానించబడ్డారు అని మంత్రి తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి ఏ రంగాల్లో, ఏ విధంగా జరుగుతుందో వివరించే సమగ్ర డాక్యుమెంట్‌ను సమ్మిట్‌లో చర్చకు పెట్టనున్నామ‌ని. నేడు 7 సాయంత్రం డ్రైవ్ రన్ నిర్వహించి అన్ని ఏర్పాట్లను శాసనబద్ధంగా ఖరారు చేయనున్నామ‌ని. డిసెంబర్ 8న 2034, 2047 విజన్ డాక్యుమెంట్‌లను అధికారికంగా ఆవిష్కరించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల ఇండిగో విమానాల రద్దు కారణంగా సమ్మిట్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అతిథుల ప్రయాణం, వసతి, రవాణా వంటి అంశాల్లో పూర్తి భద్రతా చర్యలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం, అధికారులు, పౌరులు సమిష్టిగా ముందుకు వస్తున్నారు. తెలంగాణ సామర్థ్యం, విజన్, ప్రగతిపట్ల ఉన్న నిబద్ధతను ప్రపంచానికి అద్దం పట్టే ఈ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.