Let's talk: editor@tmv.in
2034 నాటికి కొడంగల్‌ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: సీఎం

2034 నాటికి కొడంగల్‌ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: సీఎం

Gaddamidi Naveen
25 నవంబర్, 2025

తమ నియోజకవర్గాన్ని 2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గడిచిన 70 ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన కొడంగల్‌ను, దేశం నలుమూలల నుంచి వచ్చి చూసేలా అభివృద్ధి చేసుకుని ఆదర్శంగా నిలబెడతామని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా హరేకృష్ణ మూమెంట్ నిర్వహిస్తున్న ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను పరిశీలించడంతో పాటు, అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న మిడ్ డే మీల్స్ కిచెన్ భవనానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు పథకాలపై నిర్ణయాలు తీసుకుంటూ, మొత్తం రూ.103 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే లబ్ధిదారులకు చెక్కులు, చీరలను పంపిణీ చేశారు.

విద్యార్థుల ఆకలి తీర్చే కార్యక్రమాలు

సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఆడబిడ్డల సంక్షేమం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పునాదినని పేర్కొన్నారు. వారి విద్య, ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కర్తవ్యబద్ధతతో పనిచేస్తోందన్నారు. అదే దిశగా కొడంగల్‌ను ఒక ప్రయోగశాలగా ఎంచుకొని, 312 పాఠశాలల్లో చదువుతున్న 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజూ ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ఎవరూ ఆకలితో చదువు మానేయకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేయనున్నట్టు ఆయ‌న పేర్కొన్నారు.

కొడంగల్‌ను ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్పు

కొడంగల్‌ను రాష్ట్రంలోని ప్రధాన విద్యా హబ్‌గా మార్చేందుకు భారీ ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం వెల్లడించారు. మెడికల్, వెటర్నరీ, వ్యవసాయ, నర్సింగ్, పారా మెడికల్, ఫిజియోథెరపీ, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు రాష్ట్రంలో ఇప్పటివరకు లేని సైనిక్ స్కూల్‌ను కొడంగల్‌లో స్థాపించనున్నారు. రాబోయే 16 నెలల్లో రూ.5 వేల కోట్లతో అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ క్యాంపస్‌ను అభివృద్ధి చేసి, రాష్ట్ర పునర్నిర్మాణంలో స్థానిక విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రతి ఎకరాకు నీరు, పారిశ్రామిక అభివృద్ధి

కొడంగల్, మక్తల్, నారాయణపేట ప్రాంతాల కరువు సమస్య పరిష్కారానికి భారీ నీటిపథకాలు చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. కృష్ణా నదీ జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు రూ.5 వేల కోట్ల ప్రాజెక్టు అమల్లోకి వస్తుందని చెప్పారు. భూ సేకరణకు 95 శాతం రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని ఆయ‌న‌ పేర్కొన్నారు. త్వరలో కేబినెట్ ఆమోదం అనంతరం మూడు నెలల్లోనే పనులు ప్రారంభమవుతాయని ఆయ‌న తెలిపారు.లగచర్ల పారిశ్రామిక వాడ అభివృద్ధి, కొత్త సిమెంట్ పరిశ్రమ స్థాపన, అలాగే పరిశ్రమల విస్తరణకు రైల్వే కనెక్టివిటీ కీలకమని పేర్కొంటూ, వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని ఆయ‌న‌ తెలిపారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఈ మార్గ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని సీఎం హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో కోటి మహిళలకు సారె నాణ్యత గల చీరలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రతి ఇంటికీ చీర చేరేలా అధికారులు కృషి చేయాలని సీఎం సూచించారు. గ్రామాల్లో బడి, గుడి, తాగునీరు, ఇందిరమ్మ ఇండ్లు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.ఈ పర్యటనలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రూ.300 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. మద్దూరు మండల మహిళా సమాఖ్య ప్రారంభించిన బస్సు సర్వీసును ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.

2034 నాటికి కొడంగల్‌ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: సీఎం - Tholi Paluku