Let's talk: editor@tmv.in
2033 నాటికి అందరికీ ఆరోగ్య బీమా : నిర్మలా సీతారామన్

2033 నాటికి అందరికీ ఆరోగ్య బీమా : నిర్మలా సీతారామన్

Pinjari Chand
18 మార్చి, 2026

దేశంలో ఆరోగ్య బీమా విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, 2033 నాటికి ప్రతి ఒక్కరికీ బీమా కవరేజ్ కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ రాజ్యసభలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ, 2024-25లో దేశంలో బీమా రంగం గణనీయంగా విస్తరించి 58 కోట్ల మందికి కవరేజ్ అందించిందని చెప్పారు. ఆరోగ్య బీమా ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యం. 2033 నాటికి అందరికీ బీమా కల్పించాలనే ఆశాభావం ఉందని పేర్కొన్నారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెంచేందుకు 2025 డిసెంబర్‌లో ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చిందని, దీని ద్వారా బీమా వ్యాప్తి పెరిగి మార్కెట్ బలోపేతం అవుతుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో బీమా చేరువ కావడానికి 2024లో ఇన్సురెన్స్‌ రెగ్యులెటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నూతన నిబంధనలు అమలు చేసిందన్నారు. భారత్‌లో తలసరి బీమా ప్రీమియం కేవలం 97 డాలర్లు మాత్రమే ఉండగా, ప్రపంచ సగటు 943 డాలర్లుగా ఉందని తెలిపారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోందన్నారు. వ్యక్తిగత ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు, కవరేజ్ విస్తరణ వంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఆరోగ్య బీమాలో ప్రభుత్వానికీ భాగస్వామ్యం

2024-25లో ఆరోగ్య బీమా రంగం రూ.1,17,505 కోట్లకు చేరుకుందని, ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్, స్వతంత్ర సంస్థల నుంచి సమాన భాగస్వామ్యం ఉందని వెల్లడించారు. ప్రభుత్వ రంగ బీమా సంస్థలు రూ.42,420 కోట్లు, ప్రైవేట్ సంస్థలు రూ.37,752 కోట్లు, స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలు రూ.37,331 కోట్లు కవరేజ్ అందించాయని తెలిపారు. పేదల కోసం ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన వంటి పథకాలు అమలు చేస్తున్నామని, కేవలం రూ.436 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా కవరేజ్ అందిస్తున్నామని చెప్పారు. ఈ పథకంలో ఇప్పటికే 26.79 కోట్ల మంది నమోదు అయ్యారని వివరించారు.

అలాగే ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నామని తెలిపారు. ఈ పథకం కింద దేశంలోని దిగువ 40 శాతం ప్రజలకు కవరేజ్ అందుతోందని చెప్పారు. 2024 అక్టోబర్‌లో ఈ పథకాన్ని 70 ఏళ్లు పైబడిన 6 కోట్ల వృద్ధులకు విస్తరించారని తెలిపారు. 2026 ఫిబ్రవరి 28 నాటికి దేశవ్యాప్తంగా 43.52 కోట్ల ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయని వెల్లడించారు. బీమా సంస్థలపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, గత మూడు సంవత్సరాల్లో అనేక సంస్థలకు జరిమానాలు విధించామని గుర్తు చేశారు. ఉదాహరణగా రిలయన్స్‌ జనరల్‌ ఇన్సురెన్స్ పై రూ.2 కోట్ల జరిమానా విధించగా, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సురెన్స్‌పై కూడా రూ.2 కోట్ల చొప్పున, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్, రాయల్ సుందరం జనరల్‌ ఇన్సురెన్స్‌పై రూ.1 కోట్ల చొప్పున జరిమానాలు విధించామని తెలిపారు. దేశంలో ఆరోగ్య బీమా రంగం వేగంగా విస్తరిస్తోందని, ప్రభుత్వ చర్యలతో ఇది మరింత సమగ్రంగా, అందుబాటులో ఉండేలా మారుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.