
2030 నాటికి ఎగువ మధ్యతరగతి దేశంగా భారత్
భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన వేగంతో పురోగమిస్తోంది. మరో నాలుగేళ్లలో, అంటే 2030 నాటికి భారత్ 'ఎగువ మధ్యతరగతి ఆదాయ' దేశంగా అవతరించనుందని ఎస్‌బీఐ రీసెర్చ్ సోమవారం తన నివేదికలో వెల్లడించింది. అప్పటికి భారతీయుల సగటు తలసరి ఆదాయం 4,000 డాలర్లకు (సుమారు రూ. 3.63 లక్షలు) చేరుకుంటుందని అంచనా వేసింది. తద్వారా చైనా, ఇండోనేషియా వంటి దేశాల సరసన భారత్ నిలవనుంది.
మైలురాళ్లను అధిగమిస్తూ..
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్ 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక స్థాయికి చేరుకోవడానికి దాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. కానీ, ఆ తర్వాత భారత్ ప్రయాణం జెట్ వేగంతో దూసుకుపోతోంది. 2 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని కేవలం 7 ఏళ్లలోనే (2014 నాటికి) చేరుకోగా, మరో 7 ఏళ్లలోనే (2021 నాటికి) 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. ఇక అక్కడి నుంచి మరింత వేగం పుంజుకుని, కేవలం నాలుగేళ్లలోనే (2025 నాటికి) నాలుగు ట్రిలియన్ డాలర్ల మార్కును తాకింది. ఇదే జోరు కొనసాగితే, మరో రెండేళ్లలోనే అంటే 2027 నాటికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంచనా.
తలసరి ఆదాయంలో పెరుగుదల
ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ వివరణ ప్రకారం.. తలసరి ఆదాయం విషయంలోనూ భారత్ గణనీయమైన వృద్ధిని సాధించింది. స్వాతంత్య్రం వచ్చిన 62 ఏళ్లకు (2009లో) వెయ్యి డాలర్ల మార్కును చేరగా, మరో పదేళ్లలోనే (2019లో) రెండు వేల డాలర్లకు చేరింది. 2026 నాటికి ఇది 3,000 డాలర్లకు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ సగటు వృద్ధి రేటు పంపిణీలో భారత్ ఇప్పుడు 95వ పర్సంటైల్‌లో ఉండటం విశేషం.
2047 వికసిత భారత్ లక్ష్యం
ప్రభుత్వ 'వికసిత భారత్' లక్ష్యంలో భాగంగా, 2047 నాటికి భారతదేశం 'ధనిక దేశాల' జాబితాలో చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రతి భారతీయుడి సగటు వార్షిక ఆదాయం (తలసరి ఆదాయం) దాదాపు 13,936 డాలర్లకు (సుమారు రూ.12.66 లక్షలు) పెరగాల్సి ఉంటుంది. గత 23 ఏళ్ల గణాంకాలను చూస్తే, భారత్ ఏటా సగటున 8.3 శాతం వృద్ధిని సాధించింది. కాబట్టి మున్ముందు ఏటా కనీసం 7.5 శాతం వృద్ధి రేటును కొనసాగించగలిగితే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ఎస్‌బీఐ నివేదిక చెబుతోంది. అయితే భవిష్యత్తులో ప్రపంచ దేశాల ఆర్థిక ప్రమాణాలు మారి, ధనిక దేశాల హోదాకు కావాల్సిన ఆదాయ పరిమితిని ప్రపంచ బ్యాంక్ 18,000 డాలర్లకు పెంచితే మాత్రం, భారత్ ఏటా 8.9 శాతం వృద్ధిని సాధించాల్సి ఉంటుంది. ఇది ఒక సవాలుతో కూడిన పని అయినప్పటికీ, సరైన సంస్కరణలతో దీనిని సాధించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సంస్కరణలే కీలకం
రాబోయే 23 ఏళ్లలో డాలర్ల పరంగా భారత్ 11.5 శాతం నామినల్ జీడీపీ వృద్ధిని సాధించగలదని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది. జనాభా పెరుగుదల రేటు 0.6 శాతంగా ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఉన్నత ఆదాయ దేశాల జాబితాలోకి చేరాలంటే ప్రస్తుత ఆర్థిక సంస్కరణలను మరింత వేగంగా కొనసాగించాలని నివేదిక సూచించింది. కరోనాకు ముందు, తర్వాత కూడా భారత్ 10-11 శాతం వృద్ధిని కనబరిచినందున, ఈ లక్ష్యాలు సాధ్యమేనని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
