
2030 నాటికి రష్యాతో 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం: విదేశాంగ మంత్రి జైశంకర్
భారత్-రష్యాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బంధం అత్యంత విశ్వసనీయమైనదని, ఇది ‘ప్రత్యేక, విశేషాధికార వ్యూహాత్మక భాగస్వామ్యం’ అని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ కొనియాడారు. సోమవారం జరిగిన ‘భారత్-రష్యా: నూతన ద్వైపాక్షిక ఎజెండా దిశగా..’ అనే అంతర్జాతీయ సదస్సులో ఆయన వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న వార్షిక వాణిజ్యం 68.7 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
సమతుల్య వాణిజ్యమే లక్ష్యం
ఈ భారీ వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవడానికి టారిఫ్ రహిత అడ్డంకులను, నియంత్రణ పరమైన ఇబ్బందులను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జైశంకర్ తెలిపారు. 2025 డిసెంబరులో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన అనేక కొత్త రంగాల్లో సహకారానికి బాటలు వేసిందని గుర్తుచేశారు. నైపుణ్యం కలిగిన నిపుణుల రాకపోకలు, ఆరోగ్య రంగం, ఆహార భద్రత, సముద్రయాన సహకారం, ఎరువులు, విద్యా రంగాల్లో సంబంధాలు మరింత బలపడ్డాయని పేర్కొన్నారు.
అణు ఇంధన రంగంలో ‘నమ్మకమైన’ భాగస్వామి
భారత పౌర అణు ఇంధన రంగంలో రష్యా అగ్రగామి భాగస్వామిగా ఉందని జైశంకర్ అన్నారు. తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు ఇరు దేశాల సహకారానికి ఒక గొప్ప నిదర్శనమని అభివర్ణించారు. 2047 నాటికి భారత్ తన అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఈ ప్రయాణంలో రష్యా ఒక నమ్మకమైన తోడుగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సాంస్కృతిక బంధం.. నూతన కాన్సులేట్లు
కళలు, యోగా, ఆయుర్వేదం వంటి అంశాల ద్వారా ఇరు దేశాల ప్రజల మధ్య విడదీయలేని అనుబంధం ఉందని జైశంకర్ గుర్తుచేశారు. రష్యాలోని కజాన్, ఎకటెరిన్‌బర్గ్‌లలో ఏర్పాటు చేస్తున్న కొత్త రాయబార కార్యాలయాలు (కాన్సులేట్లు) ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక బంధాలను మరింత పటిష్టం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
బ్రిక్స్ వేదికగా ‘మానవతా’ దృక్పథం
ప్రస్తుతం మారుతున్న అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్, రష్యాల భాగస్వామ్యం ప్రాంతీయ, ప్రపంచ శాంతికి దోహదపడుతోందని జైశంకర్ అన్నారు. ఈ ఏడాది భారత్ ‘బ్రిక్స్’ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో.. ‘మానవత్వమే మొదటి ప్రాధాన్యం’ అనే ప్రజా కేంద్రీకృత విధానంతో ముందుకెళ్తామన్నారు. బ్రిక్స్, ఎస్సీఓ, జీ-20 వంటి వేదికల ద్వారా రష్యాతో కలిసి ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ముంబై-మాస్కోల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని పెంచేందుకు దౌత్యవేత్తలు, విధానకర్తలతో కూడిన ఈ సదస్సును రష్యా ఇంటర్నేషనల్ అఫైర్స్ కౌన్సిల్, మాస్కోలోని భారత రాయబార కార్యాలయం సంయుక్తంగా నిర్వహించాయి.
