
2030 కామన్వెల్త్ క్రీడలు, పన్ను మినహాయింపులతో పర్యాటక రంగం బలోపేతం: షెకావత్
భారతదేశంలో పర్యాటకం 20 శాతం కంటే ఎక్కువ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తో అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థ, మొత్తం మౌలిక సదుపాయాలు,పెరుగుతున్న మధ్యతరగతి జనాభాను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
జాతీయ రాజధానిలో ఎఫ్ఐసిసిఐ యొక్క 98వ ఏజిఎమ్ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి, "భారతదేశంలో పర్యాటకం సంవత్సరానికి 20 శాతం కంటే ఎక్కువ సిఏజిఆర్ తో అభివృద్ధి చెందుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను," అని అన్నారు. పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థతో, భారతీయ మధ్యతరగతి పరిమాణం పెరిగింది. ఇది పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లింది. వ్యక్తులకు రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కూడా పర్యాటక రంగానికి మద్దతు ఇచ్చిందని మంత్రి అన్నారు.
2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్య హక్కులను పొందినందుకు అహ్మదాబాద్ ప్రజలకు దేశం మొత్తానికి కూడా ఆయన అభినందనలు తెలిపారు.
"ఈ పెద్ద ఈవెంట్‌తో, 2030 వరకు, ఆ తర్వాత కూడా భారతదేశ పర్యాటక సామర్థ్యం మరింత పెరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఈ క్రీడలు పర్యాటక రంగం పై ప్రభావాన్ని సృష్టించబోతున్నాయి," అని మంత్రి షెకావత్ అన్నారు.
భారతదేశాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్దిష్ట చర్యలు ఏమిటని అడిగినప్పుడు, పర్యాటక రంగంలో వ్యక్తిగత చొరవ అనేదేమీ లేదని, అది సామూహిక ప్రయత్నమని ఆయన సూచించారు.
మేము సృష్టించిన మౌలిక సదుపాయాలు పర్యాటక రంగాన్ని బలోపేతం చేశాయి. అలాగే ఆర్ధికంగా మెరుగుపరిచాయి. ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలు అంతిమంగా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయి, ఆర్థిక వ్యవస్థను పెంచుతాయి. ఖర్చు చేయదగిన ఆదాయాన్ని పెంచుతాయని ఆయన అన్నారు. "ఈ కార్యక్రమాలన్నీ మన పర్యాటక రంగానికి బూస్టర్ డోస్ లాగా పనిచేస్తాయి," అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా,50 పర్యాటక గమ్యస్థానాలకు మౌలిక సదుపాయాల హోదా ప్రకటించామని ఆయన పేర్కొన్నారు. ఆ 50 పర్యాటక గమ్యస్థానాలు కాకుండా, దేశంలో 1 మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న ఏ పర్యాటక గమ్యస్థానానికైనా ఈ హోదా వర్తిస్తుంది. దేశంలో 1 మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు కేవలం 30 నుండి 40 మాత్రమే ఉన్నాయి. ఆచరణాత్మకంగా, దేశవ్యాప్తంగా అన్నీ ముఖ్య ప్రాంతాలకి మౌలిక సదుపాయాల హోదా కల్పిస్తున్నామన్నారు.
వేదికపై మాట్లాడుతూ, పరిశ్రమల అభివృద్ది పర్యాటక రంగానికి నిజమైన పరివర్తనను తీసుకువస్తుందని అన్నారు. ఆతిథ్య నమూనాలను పునఃపరిశీలించడానికి, వినూత్న అనుభవపూర్వక పర్యాటక ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, ప్రపంచ స్థాయిలో బెంచ్‌మార్క్ చేయబడిన సేవా శ్రేష్ఠతను స్థాపించడానికి, బలమైన కమ్యూనిటీ అనుసంధానాలను నిర్మించడానికి భారతదేశానికి ధైర్యవంతమైన ప్రైవేట్ పెట్టుబడులు అవసరం. ప్రభుత్వం ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించింది. ఇప్పుడు భారతదేశ పర్యాటక బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా నడిపించడానికి, రూపొందించడానికి, ఉన్నత స్థాయికి పెంచడానికి ఇది సమయమని మంత్రి అన్నారు.
