
2030 కామన్వెల్త్ క్రీడలు: ఆతిథ్య నగరంగా ఎంపికైన అహ్మదాబాద్
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే హక్కులను బుధవారం అధికారికంగా దక్కించుకుంది. గ్లాస్గోలో జరిగిన 74 సభ్య దేశాల కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో ఈ నిర్ణయానికి ఆమోదముద్ర పడింది. భారత్‌లో ఈ మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్ జరగడం ఇది రెండవసారి. చివరిసారిగా 2010లో న్యూఢిల్లీ ఆతిథ్యం ఇచ్చిన సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఈ క్రీడలు మళ్లీ దేశానికి రానున్నాయి. అంతకుముందు నెలలో కామన్వెల్త్ స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ బోర్డు అహ్మదాబాద్‌ను సిఫార్సు చేయగా, జనరల్ అసెంబ్లీ ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయం భారతదేశానికి ఎంతో ముఖ్యమైనది, ఎందుకంటే 2030 కామన్వెల్త్ గేమ్స్ విజయవంతం కావడం, 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే దేశ ప్రతిష్ఠాత్మక ప్రణాళికకు మరింత ఉత్తేజాన్నిస్తుంది. ఒలింపిక్స్ కూడా గుజరాత్ రాజధాని పరిసరాల్లోనే నిర్వహించాలని ప్రతిపాదన ఉంది.
కామన్వెల్త్ స్పోర్ట్ అధ్యక్షుడు డా. డొనాల్డ్ రుకరే మాట్లాడుతూ "భారతదేశం బలం, యువత, గొప్ప ఆశయం, సంస్కృతి, అపారమైన క్రీడాభిమానం, సందర్భోచితతను ఈ క్రీడలకు తీసుకువస్తుంది. మా కామన్వెల్త్ క్రీడల తదుపరి శతాబ్దాన్ని మంచి ఆరోగ్యంతో ప్రారంభిస్తున్నాము" అని అన్నారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి హర్ష్ సంఘవి మాట్లాడుతూ, "మేము సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్, గుజరాత్ పోలీస్ అకాడమీతో సహా ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాము" అని తెలిపారు. అహ్మదాబాద్ రవాణా, వసతి, బలమైన సహాయక వ్యవస్థలు ఉన్న కాంపాక్ట్ సిటీ అని ఆయన అన్నారు.
2030 ఆతిథ్యం కోసం భారతదేశానికి నైజీరియాలోని అబూజా నగరం నుండి పోటీ ఎదురైంది. అయితే, కామన్వెల్త్ స్పోర్ట్ 2034 ఎడిషన్ కోసం ఆఫ్రికన్ దేశాన్ని పరిగణించాలని నిర్ణయించింది. భారత ఒలింపిక్ సంఘం, కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ "కామన్వెల్త్ స్పోర్ట్ చూపిన నమ్మకానికి మేమంతా గౌరవంగా భావిస్తున్నాము. 2030 క్రీడలు కామన్వెల్త్ ఉద్యమానికి 100 సంవత్సరాలు పూర్తికావడాన్ని జరుపుకోవడమే కాకుండా, తదుపరి శతాబ్దానికి పునాది వేస్తాయి" అని అన్నారు.
2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల కోసం భారతదేశం మొదట్లో అంచనా వేసిన రూ.1,600 కోట్ల కంటే చాలా ఎక్కువ అంటే దాదాపు రూ.70,000 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆ ఈవెంట్‌కు ముందు అవినీతి ఆరోపణలు రావడంతో విమర్శలు కూడా ఎదురయ్యాయి. అయితే ఇటీవల కాలంలో ఆతిథ్యం ఇవ్వడానికి నగరాలు ముందుకు రాకపోవడంతో, కామన్వెల్త్ క్రీడలు ప్రాముఖ్యత కోసం పోరాడుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా దేశంలో కామన్వెల్త్ క్రీడలను మళ్లీ నిర్వహిస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ మాట్లాడుతూ "శతాబ్ది కామన్వెల్త్ క్రీడలు 2030కి ఆతిథ్యం ఇచ్చే బిడ్‌ను భారతదేశం గెలుచుకోవడం ఎంతో సంతోషకరం! భారతదేశ ప్రజలకు, క్రీడా వ్యవస్థకు నా అభినందనలు" అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ "భారతదేశం పెద్ద ఈవెంట్‌లకు ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం కలిగి ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి ప్రపంచంలోని టాప్-5 క్రీడా దేశాల్లో భారత్ ఉంటుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
2030 క్రీడల్లో 15–17 క్రీడా విభాగాలు
2030 క్రీడల్లో 15 నుండి 17 క్రీడా విభాగాలు ఉంటాయని కామన్వెల్త్ స్పోర్ట్ ధృవీకరించింది. "అహ్మదాబాద్ 2030 బృందం, కామన్వెల్త్ స్పోర్ట్, అంతర్జాతీయ సమాఖ్యల సహకారంతో స్థానిక ప్రాధాన్యతతో పాటు ప్రపంచ ఆకర్షణ కలిగిన ఒక ఉత్తేజకరమైన క్రీడా కార్యక్రమాన్ని రూపొందించడానికి కృషి చేస్తుంది" అని ఆ సంస్థ పేర్కొంది.
ఖరారైన క్రీడా విభాగాలు:
అథ్లెటిక్స్ & పారా అథ్లెటిక్స్, స్విమ్మింగ్ & పారా స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్ & పారా టేబుల్ టెన్నిస్, బౌల్స్ & పారా బౌల్స్, వెయిట్‌లిఫ్టింగ్ & పారా పవర్‌లిఫ్టింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, నెట్‌బాల్, బాక్సింగ్
పరిశీలనలో ఉన్న క్రీడలు:
ఆర్చరీ, బ్యాడ్మింటన్, 3x3 బాస్కెట్‌బాల్ & 3x3 వీల్‌చైర్ బాస్కెట్‌బాల్, బీచ్ వాలీబాల్, క్రికెట్ టీ20, సైక్లింగ్, డైవింగ్, హాకీ, జూడో, రిథమిక్ జిమ్నాస్టిక్స్, రగ్బీ సెవెన్స్, షూటింగ్, స్క్వాష్, ట్రయాథ్లాన్ & పారా ట్రయాథ్లాన్, రెజ్లింగ్. ఆతిథ్య దేశం మరో రెండు కొత్త లేదా సాంప్రదాయ క్రీడలను కూడా ప్రతిపాదించవచ్చు.
అహ్మదాబాద్‌లో ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న ప్రధాన వేదికలలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్ ఒకటి. లక్షకు పైగా సామర్థ్యం ఉన్న నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం కాకుండా, ఈ కాంప్లెక్స్‌లో అక్వాటిక్స్ సెంటర్, ఫుట్‌బాల్ స్టేడియం, ఇండోర్ క్రీడల కోసం రెండు అరేనాలు కూడా నిర్మిస్తున్నారు. ఈ కాంప్లెక్స్‌లోనే 3,000 మంది అథ్లెట్లకు వసతి కల్పించే అథ్లెట్ల విలేజ్ కూడా ఏర్పాటు కానుంది. 2028 నాటికి ఈ వేదికల నిర్మాణాన్ని పూర్తి చేయాలని గుజరాత్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
