Let's talk: editor@tmv.in
2029-30 నాటికి 6 కోట్ల మంది ‘లఖ్‌పతి దీదీ’లే లక్ష్యం: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

2029-30 నాటికి 6 కోట్ల మంది ‘లఖ్‌పతి దీదీ’లే లక్ష్యం: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

Gaddamidi Naveen
22 ఫిబ్రవరి, 2026

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'ఆర్థిక అక్షరాస్యత స్థితిస్థాపకత'పై జాతీయ సదస్సు, అలాగే 25వ సెంట్రల్ లెవల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఫిబ్రవరి 20న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. వీరితో పాటు నాబార్డ్, ఆర్బీఐ, వివిధ బ్యాంకులు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఉన్నతాధికారులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇవ్వడం దేశానికి అత్యంత భద్రమైన పెట్టుబడి అని పేర్కొన్నారు. గ్రామీణ మహిళల సాధికారత దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమని, వారి నాయకత్వంలో గ్రామీణ మార్పు సాధ్యమవుతుందని ఆయన నొక్కిచెప్పారు. ‘వికసిత భారత్’ లక్ష్య సాధనలో మహిళా శక్తి ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు.

సదస్సులో భాగంగా మూడు జాతీయ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. వ్యక్తిగత వ్యాపారాల కోసం “ఇండివిడ్యువల్ ఎంటర్‌ప్రైజ్ బ్యాంక్ లోన్ సిస్టమ్”, యూపీఐ ఆధారిత క్రెడిట్ లైన్లు, అలాగే ఎస్‌హెచ్‌జీ సభ్యుల కోసం డిజిటల్ ఆర్థిక సాక్షరత మాడ్యూల్స్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ మహిళలకు సులభ రుణ సదుపాయాలు, డిజిటల్ లావాదేవీలపై అవగాహన, ఆర్థిక స్వావలంబన పెంపు లక్ష్యంగా పెట్టుకున్నారు.

‘లఖ్‌పతి దీదీ’ అంటే సంవత్సరానికి కనీసం రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ నికర ఆదాయం పొందే మహిళ అని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.01 కోట్ల మహిళలు ఈ మైలురాయిని చేరుకున్నారని తెలిపారు. ప్రధాని నిర్ణయించిన మునుపటి లక్ష్యం ప్రకారం 2027 చివరినాటికి మూడు కోట్ల లఖ్‌పతి దీదీలను సృష్టించాల్సి ఉండగా, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది, బ్యాంకర్లు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2025 నాటికే ఆ లక్ష్యం సాధించామని ఇయ‌న చెప్పారు.

లక్ష్యం రెట్టింపు.. కొత్త రోడ్‌మ్యాప్

ఇప్పుడు లక్ష్యాన్ని రెట్టింపు చేసి ఆరు కోట్లకు పెంచినట్లు చౌహాన్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 10 కోట్ల మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరారని, వారిలో ఆరు కోట్ల మందిని లఖ్‌పతి దీదీలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక రోడ్‌మ్యాప్ సిద్ధం చేశామని పేర్కొన్నారు. అయితే, మునుపటి లక్ష్యం సాధించడం కొంత సులభమైందని, ఎందుకంటే చాలా మంది మహిళల ఆదాయం రూ.50,000 నుంచి 60,000 మధ్య ఉండేదని చెప్పారు. ప్రస్తుతం తక్కువ ఆదాయం ఉన్న మహిళల ఆదాయాన్ని పెంచడం మరింత కష్టసాధ్యమని, అందుకు విస్తృత శ్రద్ధ అవసరమని స్పష్టం చేశారు.

స్వయం సహాయక సంఘాల్లో ఇంకా చేరని మహిళలను ప్రత్యేక డ్రైవ్ ద్వారా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పెద్ద కార్పొరేట్ సంస్థల నాన్-పర్ఫార్మింగ్ ఆస్తులు అధికంగా ఉన్నప్పటికీ, ఎస్‌హెచ్‌జీ మహిళల ఎన్‌పీఏ శాతం కేవలం 1.7 శాతమేనని, ఇది వారి రుణ చెల్లింపు క్రమశిక్షణను ప్రతిబింబిస్తోందని చౌహాన్ తెలిపారు.

గత 12 ఏళ్లలో ఎస్.హెచ్.జీ మహిళలకు రూ.12 లక్షల కోట్ల రుణాలు మంజూరైనట్లు వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో మరో రూ.10 లక్షల కోట్ల రుణాలు (ప్రతి ఏడాది రూ.2 లక్షల కోట్లు) అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఎస్‌హెచ్‌జీ మహిళల వ్యక్తిగత రుణాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూ.1.50 లక్షల కోట్ల రుణాలను పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు.

బీమా, సామాజిక భద్రత

మహిళా సంఘాల సభ్యులలో 90 శాతం మందిని ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన కిందకు తీసుకువచ్చి వారికి పెన్షన్, ఇన్సూరెన్స్ రక్షణ కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. మహిళా సంఘాల రుణ తిరిగి చెల్లింపు రికార్డు అద్భుతంగా ఉందని, బడా బాబుల ఎన్‌పీఏ రేటు ఎక్కువగా ఉన్నా, మహిళల ఎన్‌పీఏ కేవలం 1.7 శాతం మాత్రమేనని ఆయన ప్రశంసించారు.

రాజకీయ విమర్శలు - పీఎం ఆవాస్ యోజన

ఈ సందర్భంగా తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై చౌహాన్ విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకోకుండా 2023లో నిధులను తిరిగి ఇచ్చేసినట్లు ఆరోపించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల పేదలు గృహ పథకం లబ్ధి నుంచి దూరమయ్యారని అన్నారు. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి మంత్రి పీఎం ఆవాస్ యోజనలో తిరిగి చేరేందుకు లేఖ రాయడం సంతోషకరమని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

మొత్తంగా, గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతను బలోపేతం చేయడం, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆదాయ వృద్ధి సాధించడం, దేశాన్ని ‘వికసిత భారత్’ దిశగా నడిపించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని చౌహాన్ పేర్కొన్నారు. 2029-30 నాటికి ఆరు కోట్ల లఖ్‌పతి దీదీల లక్ష్యం సాధించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.