
2029 నాటికి మహిళా రిజర్వేషన్ అమలు కీలకం: మోడీ
ప్రధాని నరేంద్రమోడీ 2029లో జరిగే లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మహిళా రిజర్వేషన్ అమలుతో జరగడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు మహిళా రిజర్వేషన్ చట్టంలో అవసరమైన సవరణలను ఆమోదించడానికి అన్ని రాజకీయ పార్టీలు ఒకే స్వరంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం లోక్‌సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి ముందు ఈ లేఖ పంపించారు. సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలకు అవకాశాలు, నిర్ణయాల్లో భాగస్వామ్యం, ముఖ్యంగా నాయకత్వం వహించే అవకాశం కలగాలని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలంటే మహిళల పాత్ర మరింత చురుకుగా ఉండాలని అన్నారు. విస్తృత చర్చల అనంతరం ‘నారీ శక్తి వందన్ అధినియం’ను దేశవ్యాప్తంగా నిజమైన భావంతో అమలు చేసే సమయం వచ్చిందని నిర్ణయించాం. 2029 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు మహిళా రిజర్వేషన్ అమలుతోనే జరగడం అత్యంత అవసరమని లేఖలో పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ అమలు ప్రజాస్వామ్య సంస్థలకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడంతో పాటు ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. అలాగే పాలనలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు.
‘నారీ శక్తి వందన్ అధినియం’ను సాధారణంగా మహిళా రిజర్వేషన్ చట్టంగా పిలుస్తారు. 2023లో రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే నిబంధన తీసుకొచ్చారు. అయితే అసలు చట్టం ప్రకారం 2027 జనగణన ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే ఈ రిజర్వేషన్ అమల్లోకి రావాల్సి ఉంది. అందువల్ల మొదట ఇది 2034కు ముందుగా అమలుకాకపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటే చట్టంలో మార్పులు అవసరం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 16 నుంచి 18 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ చట్టంలో మార్పులకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
బీజేపీ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ
ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికీ త్రీ లైన్ విప్ జారీ చేసింది. ఈ మూడు రోజులపాటు సభలో తప్పనిసరిగా హాజరుకావాలని, ఎలాంటి సెలవులు మంజూరు చేయమని పార్టీ స్పష్టం చేసింది. బీజేపీ విడుదల చేసిన లేఖలో ఈ మూడు రోజులపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు సభలో హాజరు కావాలి. విప్‌ను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.
