
2029 నాటికి ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేస్తాం: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో నివాస యోగ్యమైన ఇల్లు లేని నిరుపేద కుటుంబం అంటూ ఉండకూడదన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పమని 2029 నాటికి ప్రతి ఒక్కరికీ గృహవసతి కల్పించే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 2.5 లక్షలకు పైగా ఇళ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ చూపిన మార్గం తమ ప్రభుత్వానికి నిరంతరం స్ఫూర్తిదాయకమని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ 2024లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గృహనిర్మాణ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గత 20-21 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామని వివరించారు. ఇందులో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద 4.52 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 78 వేల ఇళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రారంభించిన టిడ్కో గృహ సముదాయాలను కేవలం నివాస ప్రాంతాలుగా కాకుండా, పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు వంటి ఆధునిక వసతులతో కూడిన మినీ నగరాలుగా తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం తిరుపతి జిల్లాలోనే 15,659 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించినట్లు వెల్లడించారు.
మరోవైపు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన చంద్రబాబు 2019-2024 మధ్య కాలంలో గృహనిర్మాణ రంగాన్ని గత పాలకులు పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 6.5 లక్షల ఇళ్లను మాత్రమే నిర్మించిందని, టిడ్కో లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన రూ.174 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించి వృథా చేశారని మండిపడ్డారు. పేదలకు పంపిణీ చేసిన ప్లాట్లు కూడా నివాసయోగ్యం కాని శ్మశానాలు, వాగులు, కొండ ప్రాంతాల్లో ఉండటం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. దీనికి భిన్నంగా తమ ప్రభుత్వం గతంలో (2014-2019) 8.19 లక్షల ఇళ్లను నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తూ 2029 నాటికి 'అందరికీ ఇళ్లు' లక్ష్యాన్ని చేరుకోవడానికి మరో 17 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా జూన్ నాటికి 2 లక్షలు, సెప్టెంబర్ నాటికి మరో 1.6 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని త్వరలోనే మరో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా మాదిరిగానే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జి) అందించే దిశగా అడుగులు వేస్తున్నామని హామీ ఇచ్చారు. రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్ది హైదరాబాద్, చెన్నైలను మించేలా అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మహిళా సాధికారతపై మాట్లాడుతూ 2029 నాటికి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని మహిళలు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఏపీ-తమిళనాడు మత్స్యకారుల వివాదాలపై స్పందిస్తూ ఎవరి రాష్ట్ర పరిధిలో వారు వేట సాగించాలని స్థానిక మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడాలని తిరుపతి, నెల్లూరు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.
