
2029 నాటికి ప్రతి పేదవాడికీ పక్కా ఇల్లు:సీఎం
రాష్ట్రంలో నిలువనీడ లేని పేద కుటుంబమే ఉండకూడదన్నది ప్రభుత్వ సంకల్పమని 2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం శాసనసభలో గృహనిర్మాణ, వ్యవసాయ రంగాలపై జరిగిన చర్చలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. భూమి లేని పేద కుటుంబాలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ రంగంలో జరిగిన అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇసుక విధానాన్ని అస్తవ్యస్తం చేసి అవినీతికి పాల్పడిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.
ఉగాది నుంచి గృహప్రవేశాల పండుగ
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రాయచోటిలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని రానున్న ఉగాది నాటికి రాష్ట్రంలో సామూహిక గృహప్రవేశాల పండుగ నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. ఈ ఏడాది మొత్తం 10.63 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా జూన్‌లో 2.26 లక్షలు, సెప్టెంబరులో మరో 2.10 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని వివరించారు. ఇళ్లు కావాల్సిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
అన్నదాతకు 'పంచసూత్ర' భరోసా
అదేవిదంగా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం 'పంచసూత్ర' విధానాన్ని అమలు చేస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు ప్రభుత్వ అండ అనే ఐదు సూత్రాల ద్వారా అన్నదాతను ఆదుకుంటామని తెలిపారు. రైతు సంక్షేమం కోసం 'అన్నదాత సుఖీభవ' పథకం కింద గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెండు రెట్లు అధికంగా అంటే రూ.14,000 రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని కేంద్ర సాయంతో కలిపి ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20,000 అందుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే పంట నష్టపోయిన 47 లక్షల మంది రైతులకు రూ.310 కోట్ల రాయితీని విడుదల చేశామని ధాన్య కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రూ.0,816 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసి సరికొత్త రికార్డు సృష్టించామని ఆయన గుర్తు చేశారు.
రాయలసీమకు హార్టికల్చర్ హబ్.. ఏలూరుకు కోకో సిటీ
సాగునీటి నిర్వహణలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నామని ముఖ్యంగా రాయలసీమను ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. క్లస్టర్ విధానం ద్వారా రూ.30,000 కోట్లు ప్రైవేటు భాగస్వామ్యంతో మరో రూ.70,000 కోట్ల పెట్టుబడులతో రాయలసీమ రూపురేఖలు మార్చనున్నట్లు తెలిపారు. ఏలూరు సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద కోకో సిటీని ఏర్పాటు చేయబోతున్నామని ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందిస్తూ ఏపీని గ్లోబల్ ఆక్వా హబ్‌గా మారుస్తామని పేర్కొన్నారు. రైతు అంతేకాక రైతు ఆత్మహత్యలను నివారించేందుకు ప్రతి ఘటనపై ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించామని ఏఐ అగ్రోనమిస్ట్ సేవలతో ఆధునిక వ్యవసాయాన్ని సామాన్య రైతుకు చేరువ చేస్తామని చంద్రబాబు వివరించారు.
నీటి భద్రతతో పెరిగిన భూగర్భ జలాలు
జల వనరుల సంరక్షణలో భాగంగా రాష్ట్ర సగటు భూగర్భ జలాల మట్టం 7.31 మీటర్లుగా ఉండగా అన్నమయ్య జిల్లాలో శాస్త్రీయ నిర్వహణ వల్ల 6.67 మీటర్లకు పెరిగిందని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల దాదాపు రూ.95 కోట్ల విద్యుత్ ఆదా అవడమే కాకుండా రూ.1,634 కోట్ల అదనపు జీఎస్‌డీపీ సాధించగలిగామని గణాంకాలతో వివరించారు. ప్రకృతి సేద్యం ప్రస్తుతం 15 లక్షల ఎకరాల్లో సాగుతుండగా దీనిని 50 లక్షల ఎకరాలకు విస్తరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సాగునీటి సంఘాలు ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని కౌలు రైతులకు కూడా ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో భరోసా ఇచ్చారు.
మరోవైపు రాష్ట్ర సాగునీటి రంగంపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను వేగవంతం చేసి 2026 జూన్ నాటికి అనకాపల్లి వరకు సాగునీటిని సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన సుజల స్రవంతి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇందులో భాగంగానే 2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.600 కోట్లను ప్రత్యేకంగా కేటాయించినట్లు వెల్లడించారు. నీటి నిర్వహణ ద్వారా భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచగలిగామని దీనివల్ల విద్యుత్ ఆదా కావడమే కాకుండా రాష్ట్ర జీఎస్‌డీపీ కూడా మెరుగుపడిందని తెలిపారు. అనంతరం వివిధ అంశాలపై చర్చల తర్వాత స్పీకర్ సభను మార్చి 4వ తేదీ బుధవారం వరకు వాయిదా వేశారు.
