
2029 నాటికి ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు సురక్షిత నివాసం కల్పించే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక గృహ నిర్మాణ కార్యక్రమం బుధవారం మరో కీలక ఘట్టానికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన 3 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో జరిగిన ప్రధాన వేడుకలో సీఎం పాల్గొని ఆయనే స్వయంగా పలువురు లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు, తాళాలు , ఇంటికి సంబంధించిన బల్బులు అందజేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పూర్తయిన గృహాలలో గృహప్రవేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏకకాలంలో ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో ప్రధాన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం కేవలం 17 నెలల్లో 3 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు కేటాయించింది అని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అనేది కేవలం ఆస్తి కాదని, ఇల్లు భద్రతకు, ఆత్మగౌరవానికి ప్రతీక అని ఉద్ఘాటించారు. 2029 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని ఒక్క పేద కుటుంబం కూడా ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. దివంగత ఎన్టీ రామారావు ప్రారంభించిన పేదల గృహ నిర్మాణ లక్ష్యాన్ని తమ ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు.
పేదలకు గూడు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
2014 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వివిధ విభాగాల్లో 8 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలోనే 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. గత పాలకులు పేదల సొంతింటి కలల్ని కూల్చేసింది. 4.73 లక్షల ఇళ్లు రద్దు చేసింది. 2.73 లక్షల మంది లబ్దిదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని బకాయి పెట్టింది. గత ప్రభుత్వం నిలిపేసిన ఇళ్ల నిర్మాణాలకు చెందిన బకాయి బిల్లులను దశల వారీగా కూటమి ప్రభుత్వమే చెల్లించింది. ప్రస్తుతం పూర్తి చేసిన ఈ ఇళ్లనే కాకుండా.. మరిన్ని ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
మహిళా సాధికారత, పారిశ్రామికాభివృద్ధి పై దృష్టి
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పారిశ్రామిక రంగంలో అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం వెల్లడించారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో 97 పరిశ్రమలకు శంకుస్థాపన జరగడం రాష్ట్ర వృద్ధికి ముఖ్యమని పేర్కొన్నారు. అదేవిధంగా ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు ప్రోత్సాహకాలు అందిస్తామని రాష్ట్రం పునరుత్పత్తి ఇంధన రంగంలో ముందుకు సాగుతుందని చెప్పారు. వ్యవసాయంలో నీటి వినియోగాన్ని మెరుగుపరచడానికి రాయలసీమలో డ్రిప్ పరికరాలను 90 శాతం రాయితీతో అందిస్తున్నట్లు వివరించారు.
నీటి ప్రాజెక్టులు, ఉద్యోగావకాశాల భరోసా
నదుల అనుసంధానం రాష్ట్ర భవిష్యత్తుకు అత్యవసరమని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తన జీవితకాల లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చెరువులను నింపి భూగర్భ జలాలను పెంపొందించే చర్యలు చేపట్టనున్నట్లు, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎట్టి నిర్లక్ష్యానికీ తావు ఉండదన్నారు. రాబోయే రోజుల్లో పెట్టుబడులు పెరిగి, చదువు పూర్తిచేసిన యువతకు స్వస్థలంలోనే ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇక ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన మూడు లక్షల ఇళ్లలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-బీఎల్సీ కింద 2,28,034 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్లు, పీఎంఏవై జన్మన్ పథకం కింద మరో 6,866 గృహాలు, మొత్తంగా 3,00,192 ఇళ్లకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి గృహ ప్రవేశాలు జరిగాయి.
