
2028 లాస్ ఏంజెల్స్ ఒలంపిక్సే లక్ష్యం: సావన్ బర్వాల్
భారత అథ్లెటిక్స్‌లో కొత్త ఆశగా నిలుస్తున్న మారథన్ పరుగు వీరుడు సావన్ బర్వాల్ , లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్‌పై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన రొట్టెర్‌డ్యాం మారథన్ 2026లో 2 గంటల 11 నిమిషాల 58 సెకండ్ల టైమ్‌తో సంచలన ఆరంగేట్రం చేసి జాతీయ రికార్డును బద్దలు కొట్టారు.
ఈ రికార్డు గతంలో 1978లో శివ్‌నాథ్ సింగ్ నెలకొల్పారు. 48 సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉండింది. ఫినిష్ లైన్ దాటిన వెంటనే రికార్డు గురించి ఆలోచించలేదని, కొద్దిసేపటి తర్వాతే ఈ ఘనత అర్థమైందని బర్వాల్ చెప్పారు. ఇది తనకు మాత్రమే కాకుండా భారత అథ్లెటిక్స్‌కు కూడా ప్రత్యేకమైన క్షణమని పేర్కొన్నారు. రేస్ చివరి దశ చాలా కష్టంగా అనిపించిందని, చలి, గాలి కారణంగా శరీరం సహకరించలేదని తెలిపారు. కొన్నిసార్లు తల తిరిగినప్పటికీ మానసిక ధైర్యంతోనే రేస్ పూర్తి చేశానన్నారు. ముందుగా 1500 మీటర్లు, 5000 మీటర్ల రేసుల్లో పాల్గొన్న బర్వాల్, మారథాన్‌కు మారడం సులభం కాదని చెప్పారు. స్పీడ్ నుంచి ఎండ్యూరెన్స్ వైపు మారాల్సి ఉండటం పెద్ద సవాలుగా మారిందన్నారు. శారీరకంగా, మానసికంగా కొత్త రీతిలో శిక్షణ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
మారథాన్‌పై దృష్టి పెట్టడం క్రమంగా తీసుకున్న నిర్ణయమని, కోచ్‌ల మార్గదర్శకత్వం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. ఇకపై కూడా మారథాన్‌పై ప్రధానంగా ఫోకస్ చేస్తూ, ముఖ్యంగా 2028 లాస్‌ఎంజిల్స్ ఒలంపిక్స్‌లో మంచి ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యమని చెప్పారు. తక్షణ లక్ష్యంగా టైమింగ్‌ను మరింత మెరుగుపరచడం, మధ్యకాలంలో ఆసియా క్రీడలు వంటి అంతర్జాతీయ పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధించడం, దీర్ఘకాలంలో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రతినిధ్యం వహించడం ముఖ్యమని వివరించారు. భారతదేశంలో గతంలో మారథాన్‌కు తగిన స్థాయి శిక్షణ, అవకాశాలు లేకపోవడం వల్లే రికార్డు ఇంతకాలం నిలిచిందని, ఇప్పుడు మెరుగైన సదుపాయాలతో అథ్లెట్లు మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తున్నారని బర్వాల్ తెలిపారు.
