Let's talk: editor@tmv.in
2028లో చంద్రయాన్-4 ప్రయోగం: ఇస్రో చైర్మన్ వి.నారాయణన్

2028లో చంద్రయాన్-4 ప్రయోగం: ఇస్రో చైర్మన్ వి.నారాయణన్

Shaik Mohammad Shaffee
17 నవంబర్, 2025

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ వి. నారాయణన్ తమ సంస్థ ముందు ఉన్న భారీ ప్రణాళికలను, లక్ష్యాలను వివరిస్తూ కీలక ప్రకటన చేశారు. ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చంద్రయాన్-4, గగన్‌యాన్, సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, ఉపగ్రహాల ప్రయోగాలతో సహా అనేక మిషన్లతో ఇస్రో ప్రస్తుతం అత్యంత బిజీగా మారిందని తెలిపారు. రాబోయే కాలంలో విజ్ఞానం, సాంకేతికత, పారిశ్రామిక సామర్థ్యం పరంగా ఇస్రో వేగంగా విస్తరించడానికి సిద్ధమవుతోందని పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఏడు ప్రయోగాలు చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయోగాలలో వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహాలతో పాటు, బహుళ పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మిషన్లు ఉన్నాయి. ముఖ్యంగా పూర్తిగా దేశీయంగా తయారు చేసిన పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం ఈ బ్యాచ్‌లో ఉండటం ఒక విశేషం. మిషన్ల డిమాండ్‌కు అనుగుణంగా, రాబోయే మూడేళ్లలో వ్యోమనౌకల వార్షిక ఉత్పత్తిని మూడు రెట్లు పెంచేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది.

2028లో చంద్రయాన్-4 ప్రయోగం

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చంద్రయాన్-4 మిషన్‌కు ఆమోదం తెలిపిందని ఇస్రో చీఫ్ వి. నారాయణన్ వెల్లడించారు. ఈ క్లిష్టమైన మిషన్ ప్రధాన లక్ష్యం 2028 నాటికి చంద్రుడి నుంచి మట్టి నమూనాలను సేకరించి, తిరిగి భూమిపైకి తీసుకురావడం. ప్రస్తుతం రష్యా, అమెరికా, చైనాలకు మాత్రమే ఈ సాంకేతిక సామర్థ్యం ఉంది. అలాగే జపాన్ అంతరిక్ష సంస్థతో కలిసి చేపట్టిన లూపెక్స్ మిషన్ కూడా ఇస్రో ప్రణాళికల్లో ఉంది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంలోని మంచును అధ్యయనం చేయాలని ఇస్రో భావిస్తోంది.

2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం

భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయని ఇస్రో చైర్మన్ తెలిపారు. ఈ అంతరిక్ష కేంద్రంలోని ఐదు మాడ్యూల్స్‌లో మొదటి మాడ్యూల్‌ను 2028 నాటికి కక్ష్యలో ఉంచాలని నిర్ణయించారు. ఇది పూర్తయితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చైనా తియాంగాంగ్‌ల తర్వాత, సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న మూడో దేశంగా భారత్ అవతరిస్తుంది.

2040 చంద్రుడిపైకి ఆస్ట్రోనాట్స్

గగన్‌యాన్ మిషన్‌పై ఉన్న సందేహాలకు స్పష్టత ఇస్తూ, సిబ్బందితో కూడిన మానవ సహిత గగన్‌యాన్ మిషన్ ఎప్పటిలాగే 2027 నాటికి చేపడతామని నారాయణన్ స్పష్టం చేశారు. కేవలం మానవ రహిత టెస్టింగ్ మిషన్ల గడువు మాత్రమే కాస్త మారింది. భారత వ్యోమగాములతో కూడిన తొలి యాత్రకు ముందు మూడు మానవ రహిత టెస్టింగ్ మిషన్లు జరుగుతాయి. అంతేకాకుండా మన వ్యోమగాములను చంద్రుడిపైకి పంపి, తిరిగి సురక్షితంగా భూమికి తీసుకువచ్చే క్లిష్టమైన మిషన్ ను 2040 నాటికి సాకారం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించినట్లు వి. నారాయణన్ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఇండియన్ స్పేస్ ఎకానమీ విలువ 8.2 బిలియన్ డాలర్లు కాగా, ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 2 శాతం వరకు మాత్రమే ఉంది. దీనిని 2030 నాటికి 8 శాతానికి పెంచాలని ఇస్రో కృషి చేస్తోంది. భారత స్పేస్ ఎకానమీ 2033 నాటికి 44 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. 2020లో అంతరిక్ష రంగంలో సంస్కరణలు వచ్చిన తర్వాత ప్రైవేట్ భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. కొన్నేళ్ల క్రితం కేవలం 3 స్టార్టప్‌లు ఉండగా, ఇప్పుడు ఏకంగా 450 కంపెనీలు, 330 స్టార్టప్‌లు భారత అంతరిక్ష రంగంలో చురుకుగా పనిచేస్తున్నాయని ఇస్రో చైర్మన్ తెలిపారు.

చంద్రయాన్-4 గురించి..

చంద్రయాన్-4 ఇస్రో రూపొందిస్తున్న భారత తొలి లూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్. ఇది చంద్రుని ఉపరితలం నుంచి రాళ్లు, నేల నమూనాలు సేకరించి భూమికి తీసుకువచ్చే అత్యంత క్లిష్టమైన ప్రయత్నం. ఈ మిషన్‌ను 2028లో ప్రయోగించాలనే లక్ష్యాన్ని ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్-4లో ల్యాండర్, నమూనాలు సేకరించే వ్యవస్థ, చంద్రుని నుంచి పైకి ఎగిరే అసెంట్ మాడ్యూల్, కక్ష్యలో డాకింగ్ అయ్యే రిటర్న్ మాడ్యూల్, చివరిగా భూమికి నమూనాలు తెచ్చే రీఎంట్రీ క్యాప్సూల్ ఉంటాయి. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఇలాంటి సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఈ మిషన్ ద్వారా చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతపు నిర్మాణం, ఖనిజాలు, నీటి మంచు ఉనికి వంటి అంశాలపై కీలక శాస్త్రీయ సమాచారం లభిస్తుంది. ఇది భవిష్యత్‌లో భారత మానవ చంద్రుడి యాత్రలకు కీలక పునాది అవుతుంది.