
2027 నాటికి భూవివాదాలకు శాశ్వత పరిష్కారం: సీఎం
రాష్ట్రంలో భూ రికార్డుల తారుమారుకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా క్యూఆర్ కోడ్లు, బ్లాక్‌చైన్ సాంకేతికతతో చేపట్టిన భూసర్వేలను 2027 నాటికి పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ విధానం అమలుతో ఆంధ్రప్రదేశ్‌లో భూవివాదాలకు పూర్తిగా ముగింపు పలుకుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నారావారిపల్లెలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ భూసర్వే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా నియమించిన జాయింట్ కలెక్టర్లకు ఒక సంవత్సరపు గడువు విధించామని వెల్లడించారు. రెవెన్యూ వ్యవస్థలో ఎలాంటి నిర్లక్ష్యం, పొరపాట్లు సహించబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతి నెల 9వ తేదీన పట్టాదారు పుస్తకాలు అందిస్తామని, రూపాయి ఖర్చు లేకుండా క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ పట్టాలు జారీ చేస్తామని తెలిపారు.
“క్యూఆర్ కోడ్లు, బ్లాక్‌చైన్ టెక్నాలజీతో అనుసంధానించిన భూసర్వేలు భూ రికార్డుల తారుమారుకు శాశ్వత ముగింపు పలుకుతాయి. 2027 నాటికి రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలే ఉండవు. అదే నాకు అతిపెద్ద బాధ్యత అని చంద్రబాబు అన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఇష్టం లేని వారి భూములను 22ఏ కింద చేర్చి గందరగోళం సృష్టించారని విమర్శించారు.
ఈ సందర్భంగా పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్ట్‌నర్‌షిప్ (పి4) కార్యక్రమంపై సీఎం విస్తృతంగా వివరించారు. టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటికీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటైనప్పటికీ బిలియనీర్లు పెరుగుతున్న కొద్దీ అసమానతలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అందుకే అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యంగా పి4 కార్యక్రమాన్ని ప్రారంభించి 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నామని తెలిపారు.
పీ4 కేవలం ఆర్థిక సహాయానికి మాత్రమే పరిమితం కాదని, మెంటారింగ్, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు, సమయానుకూల నిర్ణయాలే అసలు బలమని చంద్రబాబు అన్నారు. 2026లో ఈ కార్యక్రమంపై మరింత ఫోకస్ పెడతామని వెల్లడించారు. ప్రభుత్వ పాలసీలతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్న వారు తమ జన్మభూమిని మర్చిపోకుండా గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
గతంలో గ్రామాలకు వెళ్లడానికి ప్రజలు భయపడిన పరిస్థితులు ఉన్నాయని, అయితే ఈ ఏడాది స్వగ్రామాలకు వెళ్లి పండగలను ఉత్సాహంగా జరుపుకున్నారని సీఎం తెలిపారు. మూడు రోజుల పాటు స్వగ్రామంలోనే ఉండి స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నానన్నారు. భోగి, సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామని, సంక్రాంతి రైతుల పండుగగా పంటలు ఇంటికి చేరి కుటుంబాలు ఆనందంగా గడుపుతాయని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లకు రూ.10 వేల కోట్లకు పైగా రైతులకు చెల్లించామని తెలిపారు.
2047 స్వర్ణాంధ్ర–వికసిత్ భారత్ లక్ష్యంగా ‘స్వర్ణాంధ్ర విజన్’ రూపొందించి 2029, 2039 లక్ష్యాలతో పని చేస్తున్నామని సీఎం తెలిపారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నిర్మాణమే ప్రభుత్వ ఆశయమని పేర్కొన్నారు. స్వర్ణ నారావారిపల్లె కార్యక్రమానికి గత ఏడాది శ్రీకారం చుట్టామని, రంగంపేట, కందులవారిపల్లె, చిన్నరామపురం పంచాయతీలను పైలట్‌గా తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మరుగుదొడ్లు, దీపం, పింఛన్లు, ఇళ్ల స్థలాల గుర్తింపు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఏడాది లోపు ప్రతి అర్హుడికి ఇల్లు, ఇంటింటికీ నీటి సరఫరా అందిస్తామని స్పష్టం చేశారు.
రోడ్ల నిర్మాణంతో పాటు రంగంపేటను జాతీయ రహదారికి అనుసంధానం చేస్తామని చెత్తను వందశాతం సేకరించి తడి చెత్త నుంచి కంపోస్ట్, పొడి చెత్తను సర్క్యులర్ ఎకానమీకి పంపిస్తున్నామని తెలిపారు. గ్రామాలను పరిశుభ్రమైన ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
ఆరోగ్య రంగంలో ‘సంజీవని’ కార్యక్రమం విజయవంతమైందని, కుప్పంలో సక్సెస్ అయిన ఈ మోడల్‌ను ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో అమలు చేస్తున్నామని, ఈ ఏడాదే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం, డెయిరీ రంగానికి ప్రోత్సాహం ఇస్తూ, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, కేర్ అండ్ గ్రో కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీ ఆయాలకు శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
రంగంపేట హైస్కూల్, జూనియర్ కాలేజీని కేంద్రంగా విద్యాభివృద్ధిపై దృష్టి పెట్టామని, పర్యాటక రంగంలో తిరుపతి గ్రామీణ ప్రాంతాల్లో హోం స్టేలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. తిరుపతి రాబోయే రోజుల్లో వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్‌గా మారుతుందని, తిరుపతి,విశాఖ,అమరావతిని మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు వెల్లడించారు.
