Let's talk: editor@tmv.in
2027 నాటికి ప్రతి గిరిజన కుటుంబానికి తాగునీరు, పక్కా ఇల్లు: సీఎం చంద్రబాబు
2027 నాటికి ప్రతి గిరిజన కుటుంబానికి తాగునీరు, పక్కా ఇల్లు: సీఎం చంద్రబాబు
2027 నాటికి ప్రతి గిరిజన కుటుంబానికి తాగునీరు, పక్కా ఇల్లు: సీఎం చంద్రబాబు

2027 నాటికి ప్రతి గిరిజన కుటుంబానికి తాగునీరు, పక్కా ఇల్లు: సీఎం చంద్రబాబు

Gaddamidi Naveen
10 ఆగస్టు, 2026

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గిరిజన కుటుంబానికి 2027 నాటికి సురక్షితమైన తాగునీరు, పక్కా గృహసదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆదివారం విజయవాడలోని అంబేడ్కర్ కళావేదిక వద్ద ఘనంగా నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గిరిజనుల సంక్షేమం, వారి రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. గిరిజనులు ప్రకృతితో మమేకమై జీవిస్తూ, తమ విశిష్టమైన సాంస్కృతిక వారసత్వాన్ని, సంప్రదాయాలను కాపాడుకుంటున్నారని సీఎం కొనియాడారు.

రూ. 4,764 కోట్లతో గిరిజనాభివృద్ధి & మౌలిక వసతులు

రాష్ట్రంలోని 27.3 లక్షల మంది గిరిజన జనాభా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం రూ. 4,764 కోట్లు కేటాయించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఐటీడీఏల ద్వారా మౌలిక వసతులు, ఉపాధి, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతల కష్టాలకు స్వస్తి పలికేందుకు 108, 104 సంచార వైద్య వాహనాలతో పాటు ప్రత్యేక ఫీడర్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. 'అడవి తల్లి బాట' కార్యక్రమం కింద రూ. 1,000 కోట్లతో 905 కిలోమీటర్ల రోడ్లను ఇప్పటికే పూర్తి చేశామని, 2,336 గిరిజన నివాస ప్రాంతాలకు రహదారి సదుపాయం కల్పించేందుకు మిషన్ మోడ్‌లో పనులు వేగవంతం చేశామని తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలను పరిష్కరించి డిజిటల్ నెట్‌వర్క్ అందించేందుకు కొత్తగా సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

అరకు కాఫీకి గ్లోబల్ బ్రాండింగ్

పాతికేళ్ల క్రితం తాము పునాది వేసిన అరకు కాఫీ నేడు అంతర్జాతీయ స్థాయి ప్రముఖ బ్రాండ్‌గా ఎదిగిందని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అరకు కాఫీని ఆస్ట్రేలియా ప్రధానికి బహుమతిగా ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారని, పార్లమెంట్‌లో కూడా అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగును విస్తరించి, గిరిజన ప్రాంతాలను కాఫీ, మిరియాలు, పసుపు వంటి వాణిజ్య పంటల హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు ప్రాసెసింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సీతాంపేట పసుపు, రంపచోడవరం రబ్బరు, పార్వతీపురం మన్యం అనాస (పైనాపిల్), తేనె, తాటి బెల్లం వంటి ఉత్పత్తులకు మంచి ధర లభించేలా విలువైన ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

1.5 లక్షల మంది గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ

గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు 1.5 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. గిరిజన విద్యార్థులు పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను కూడా చేపడతామని చెప్పారు. విద్య, నైపుణ్యం, ఉపాధి అవకాశాలను అనుసంధానం చేసి యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కుదిరిన 19 ఒప్పందాల ద్వారా సుమారు 60 వేల మందికి ప్రయోజనం కలుగుతుందని సీఎం తెలిపారు. ఈ ఒప్పందాలు గిరిజన ప్రాంతాల్లో కొత్త జీవనోపాధి, ఉపాధి, అభివృద్ధి అవకాశాలకు దోహదపడతాయని చెప్పారు. గిరిజనుల అభివృద్ధికి పరిపాలనా ప్రాధాన్యత పెంచే ఉద్దేశంతో మూడు జిల్లాలను గిరిజన సమాజంపై ప్రత్యేక దృష్టితో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి

గిరిజన ప్రాంతాలు అటవీ సంపద, పచ్చదనం, ప్రకృతి అందాలతో పర్యాటకానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని, అయితే దాని ద్వారా కలిగే ప్రయోజనాలు స్థానిక గిరిజన సమాజానికి చేరేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రకృతి పరిరక్షణతో పాటు స్థానికులకు ఉపాధి, ఆదాయ అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఉన్నత స్థాయికి ఎదగాలంటే సంకల్పం అవసరం

గిరిజన మహిళగా ప్రారంభమైన ద్రౌపది ముర్ము రాజకీయాల్లో మంత్రి, ఒడిశా గవర్నర్‌గా ఎదిగి చివరకు భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. సంకల్పం, అవకాశాలు ఉంటే ఎవరైనా అత్యున్నత స్థాయికి ఎదగగలరని అన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంటి నాయకులు సాధారణ నేపథ్యాల నుంచి ఎదిగిన ఉదాహరణలని చెప్పారు.

‘నేను, నా దేశం, నా రాష్ట్రం, నా గ్రామం, నా కుటుంబం’ అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజానికి ఏమి చేయగలమో ఆలోచించాలని సీఎం పిలుపునిచ్చారు. దేశ సేవ అంటే సరిహద్దుల్లో యుద్ధం చేయడం మాత్రమే కాదని, రైతు వ్యవసాయ ఉత్పత్తిని పెంచినా, మహిళ స్వయం ఉపాధి ద్వారా కుటుంబాన్ని ఆదుకున్నా అది దేశ సేవేనని అన్నారు. విద్యార్థి, ఉపాధ్యాయుడు, ఉద్యోగి, వ్యాపారి, కార్మికుడు ఇలా ప్రతి ఒక్కరూ తమ పనిని అంకితభావంతో, సమర్థంగా నిర్వహించడం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావచ్చని చెప్పారు.

ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ వంటి అంశాల్లోనూ ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రాలకు, దేశాలకు ఉన్నట్లే వ్యక్తులకు కూడా భవిష్యత్తుపై స్పష్టమైన విజన్ ఉండాలని అన్నారు. ప్రధాని మోడీ ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని నిర్దేశించగా, తాను 2047 నాటికి ‘స్వర్ణాంధ్ర’ నిర్మాణం కోసం విజన్‌ను రూపొందించినట్లు తెలిపారు.

అల్లూరి స్ఫూర్తికి గౌరవం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ద్వారా ఆయనకు గౌరవం కల్పించామని చంద్రబాబు చెప్పారు. విమానాశ్రయ ప్రారంభోత్సవంలో గిరిజనుల ధింసా నృత్య ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించడం ద్వారా గిరిజన సంస్కృతికి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయం కూడా పెరుగుతోందని సీఎం తెలిపారు. ప్రకృతి అనుకూల పద్ధతుల్లో విలువైన పంటలను సాగు చేస్తున్న రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. గిరిజనుల సంక్షేమం, సంస్కృతి పరిరక్షణతో పాటు వారి ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

2027 నాటికి ప్రతి గిరిజన కుటుంబానికి తాగునీరు, పక్కా ఇల్లు: సీఎం చంద్రబాబు - Tholi Paluku