Let's talk: editor@tmv.in
2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: సీఎం

2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: సీఎం

Panthagani Anusha
14 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించి, అభివృద్ధి పథంలో పరుగులు తీయించడమే తమ ప్రభుత్వ ఏకైక సంకల్పమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. గత ఐదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్దుతూ రాబోయే రోజుల్లో 'డబుల్ ఇంజన్' సర్కార్‌తో 'త్రిబుల్' ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

టెక్నికల్ హబ్‌గా అమరావతి

రాష్ట్రాన్ని భవిష్యత్ సాంకేతిక కేంద్రంగా మార్చే క్రమంలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. దీనిపై యువతలో ఉన్న ఆసక్తికి 60 వేల మంది రిజిస్ట్రేషన్లే నిదర్శనమని పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలు దేశానికే మోడల్ రాష్ట్రాలుగా నిలుస్తాయని ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని పేర్కొన్నారు. . ఇళ్లపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసి గ్రిడ్‌కు అనుసంధానించే 'ప్రొజ్యూమర్' విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి గురించి వివరిస్తూ విశాఖపట్నంలో గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని సీఎం తెలిపారు. అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ వంటి మెగా ప్రాజెక్టులు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చనున్నాయని వెల్లడించారు. ఇటీవల జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 610 ఒప్పందాలు కుదిరాయని మొత్తంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 23 లక్షల ఉద్యోగాల సృష్టి తమ లక్ష్యమని ప్రకటించారు.

ఉద్యోగాల విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మెగా డీఎస్సీ ద్వారా టీచర్లకు పోస్టింగులు ఇచ్చామని పేర్కొన్నారు. కానిస్టేబుళ్ల నియామకాలు పూర్తి చేసి స్టైఫండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచినట్లు తెలిపారు. పరిశ్రమలకు భూములు, ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

2027 నాటికి పోలవరం పూర్తి.. రాయలసీమకు రూ.లక్ష కోట్లు

రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. గత పాలనలో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్‌ను రూ.1,000 కోట్లతో పునర్నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాయలసీమను ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.1 లక్ష కోట్లతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని గోదావరి జలాలను నల్లమల సాగర్‌కు తరలించి కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని వివరించారు. రైతు సంక్షేమం కోసం అక్వాకల్చర్‌కు యూనిట్‌కు రూ.1.50 కే విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆరోగ్య రంగంలో 'సంజీవని'.. 16న రాష్ట్రానికి బిల్ గేట్స్

ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతూ 'సంజీవని' ప్రాజెక్టును ప్రస్తావించారు. ఈ నెల 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ రాష్ట్రానికి రానున్నారని గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ప్రతి పౌరుడికి 'డిజిటల్ హెల్త్ రికార్డ్' రూపొందించి వ్యక్తిగత వైద్య సేవలు అందిస్తామని వెల్లడించారు. జనాభా నిర్వహణపై ఈ సెషన్‌లోనే సమగ్ర విధానాన్ని తీసుకురానున్నామని సీఎం తెలిపారు.

గత ప్రభుత్వం విద్యుత్ రంగంలో రూ.1,22,422 కోట్ల భారీ బకాయిలు మిగిల్చిందని చంద్రబాబు విమర్శించారు. ట్రూ-అప్ భారం రూ.4,860 కోట్లను ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తుందని రాబోయే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి 2026 నాటికి రాజముద్రతో అధికారిక పాస్ పుస్తకాలు జారీ చేస్తామని ప్రకటించారు.