Let's talk: editor@tmv.in
2027 జనాభా గణనపై ప్రజల్లో అవగాహన కల్పించండి: ఏపీ సీఎస్ ఆదేశం

2027 జనాభా గణనపై ప్రజల్లో అవగాహన కల్పించండి: ఏపీ సీఎస్ ఆదేశం

Gaddamidi Naveen
31 జనవరి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2027లో జరగనున్న జనాభా గణన ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా, సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ మెగా ఎన్యూమరేషన్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

గురువారం అమరావతిలో జనాభా గణన సన్నాహక ఏర్పాట్లపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భారీ ప్రక్రియ విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని పేర్కొన్నారు. జనాభా గణన ఎందుకు నిర్వహిస్తారు, దానివల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ దిశగా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.

రాష్ట్ర జనగణన డైరెక్టర్ జే. నివాస్ ఇప్పటికే జనగణనకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసినట్లు విజయానంద్ కలెక్టర్లకు గుర్తుచేశారు. ఆ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ 2027 జనగణనను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.

అదేవిధంగా 2027 జనగణన పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఐఈసీ (సమాచారం, విద్య, కమ్యూనికేషన్) ప్రచార సామగ్రిని సిద్ధం చేయాలని రాష్ట్ర జనగణన డైరెక్టర్ నివాస్‌కు ప్రధాన కార్యదర్శి సూచించారు. ఆ ప్రచార సామగ్రిని అన్ని జిల్లాలకు పంపించి, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు.

జనగణన అనేది ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, అభివృద్ధి ప్రణాళికలకు కీలకమైన ఆధారం కావడంతో, ప్రజల సహకారం అత్యంత అవసరమని అధికారులు పేర్కొన్నారు. అందుకే ముందుగానే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా 2027 జనగణనను సమర్థవంతంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఈ సమావేశంలో స్పష్టమైంది.

అందుకే ప్రతి ఒక్కరూ ఈ గణనలో సరైన వివరాలను నమోదు చేసేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని, సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎస్ విజయానంద్ ఈ సమావేశంలో వెల్లడించారు.

2027 జనాభా గణనపై ప్రజల్లో అవగాహన కల్పించండి: ఏపీ సీఎస్ ఆదేశం - Tholi Paluku