
2027 జనగణన: సాంకేతికత, సామాజిక సున్నితత్వం, సమతుల్యత
2027లో జరగబోయే భారత జనగణన దేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో ఒక కీలక మలుపు. పదహారేళ్ల విరామం తరువాత జరుగుతున్న ఈ జనగణన, కేవలం సంఖ్యల లెక్కింపే కాదు; దేశ ఆర్థిక, సామాజిక, ರಾಜకీయం మధ్య వేల కొలమానాలను మార్చే ప్రక్రియ. ఈసారి భారత ప్రభుత్వం పూర్తిగా డిజిటల్ పద్ధతుల్లో జనగణన నిర్వహించబోతున్నది. మొబైల్ యాప్‌లు, స్వీయ నమోదు, జియోట్యాగింగ్, రియల్‌టైమ్ డాష్‌బోర్డులు ఈ అన్ని నవీకరణలు భారత జనగణనను ఆధునిక దిశగా నడిపిస్తున్నాయి. కానీ ఈ సాంకేతిక దూకుడు దేశపు సామాజిక వాస్తవాలను గౌరవిస్తూ సాగుతుందా అన్న ప్రశ్న మరింత బలంగా వినిపిస్తోంది.
జనగణనలో సాంకేతికత సూత్ర ప్రాయంగా గొప్ప ఆలోచన. కాగితాల కట్టలు, చేతివ్రాత పొరపాట్లు, లెక్కలలో ఆలస్యాలు వంటి సమస్యలు సంవత్సరాలుగా జనగణనను మందగింపజేశాయి. యాప్ ఆధారిత సేకరణ వాటిని తగ్గిస్తుంది. వివరాలు నేరుగా సర్వర్లకు చేరుతాయి. తప్పిదాలను వెంటనే సరిదిద్దే వీలు ఉంటుంది. ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కొత్త పారదర్శకతకు దారి తీస్తుంది. ఇవన్నీ ఆశాజనకమైన అభివృద్ధి సూచనలే. కానీ ఇక్కడే ప్రధాన సమస్య మొదలవుతుంది భారతదేశపు డిజిటల్ అసమానత.
స్వీయ నమోదు అసలు దేశ జనాభాలో ఎంతవరకు సాధ్యం? గ్రామీణ ప్రాంతాలు, ఆదివాసీ పర్వత ప్రాంతాలు, ఇంటర్నెట్ లేని మండలాలు, పేదవారి బస్తీలు ఇక్కడ డిజిటల్ యాక్సెస్, స్మార్ట్‌ఫోన్ వినియోగం, డేటా అవగాహన చాలా తక్కువగా ఉన్నాయి. ఇంటర్నెట్ సరిగా లేని చోట జనగణన ఎలా సాగుతుంది? పేదవాడికి స్మార్ట్‌ఫోన్ లేకుంటే అతని నివాసం, పిల్లలు, వృత్తి, కులం మొదలైన సమాచారం ఎవరు నమోదు చేస్తారు? సాంకేతిక కేంద్రిత సేకరణ కనిపించనివారిని మరింత మరుగున పడేలా చేసే ప్రమాదం ఉంది.
అందులోనూ ఈసారి అత్యంత సున్నితమైన అంశం కులవర్గీకరణ. భారత దేశం ఎన్నో సంవత్సరాలుగా అధికారిక జనగణనలో కుల సమాచారాన్ని పొందుపరచలేదు. ఇప్పుడు దాన్ని మళ్లీ తీసుకురావడం కొందరికి సంతోషం, మరికొందరికి ఆందోళన. కులాల సంఖ్య, శ్రేణీకరణ, అంతర్గత వర్గాలు ఇవి అన్నీ దేశవ్యాప్తంగా ఎంత భిన్నంగా ఉన్నాయో తెలిసిందే. డిజిటల్ ఫారమ్‌లు సరిగా రూపొందకపోతే, గందరగోళం మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని కులాలు ఏ వర్గంలో నమోదు కావాలో తెలియకపోవచ్చు. ఒకే కులానికి వివిధ ప్రాంతాలలో వేర్వేరు పేర్లు ఉండవచ్చు. డేటా లోపాలు లేదా అర్థాంతరాలు భవిష్యత్తు విధానాలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి.
డిజిటల్ జనగణన మరో ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది డేటా భద్రత. కోట్లాది కుటుంబాల వ్యక్తిగత వివరాలు సర్వర్లలో నిల్వ చేయబడతాయి. ఆధార్, బ్యాంకింగ్, ఆరోగ్య డేటా మధ్యన ఇప్పటికే గోప్యత పై సందేహాలు పెరిగిన ఈ కాలంలో, జనగణన డేటా అత్యంత సున్నితమైనది. ఇది తప్పుడు చేతులలో పడితే దాని వినియోగం రాజకీయంగా, వాణిజ్యపరంగా, సామాజికంగా దుష్పరిణామాలు కలిగించగలదు. భారతదేశంలో సమగ్ర డేటా రక్షణ చట్టం ఇంకా పూర్తి స్థాయిలో అమలుకాలేదు. కాబట్టి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా భద్రతా ప్రోటోకాల్‌లు పారదర్శకంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది.
జనగణనలో పునాది పాత్ర పోషించే గణకులు కూడా ప్రధాన సవాలే. వారు యాప్‌లను నేర్చుకోవాలి, భవనాలను జియోట్యాగ్ చేయాలి, డేటా సరిదిద్దాలి అవి అన్నీ తమ స్వంత పరిధిలో. అంతేకాదు, కులం, వికలాంగత్వం, ఆదాయం, కుటుంబ నిర్మాణం వంటి సున్నితమైన ప్రశ్నలు అడిగేటప్పుడు సరైన శిక్షణ, భాషా అవగాహన, సామాజిక సున్నితత్వం అవసరం. శిక్షణ బలహీనంగా ఉంటే ఈ ప్రయత్నం ఆందోళనకరంగా మారుతుంది.
అయితే ఈ సమస్యలన్నీ ఉన్నప్పటికీ డిజిటల్ జనగణనను వదిలేయలేము. భారతదేశం 140 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం. పాత పద్ధతులతో డేటా సేకరణ కొనసాగితే ఫలితాలు ఆలస్యమవుతూనే ఉంటాయి. పాలన, విధాన రూపకల్పన, పట్టణ ప్రణాళిక, సామాజిక న్యాయం ప్రతి రంగంలోనూ తాజా, ఖచ్చితమైన డేటా అవసరం. వలసదారుల గమ్యాలు, వాతావరణ మార్పుల ప్రభావాలు, లింగ సమానత్వ స్థితి, పట్టణీకరణ శక్తి వీటన్నిటికీ సాంకేతికతయే పరిష్కారం. డిజిటల్ జనగణన దీనికి మంచి అవకాశంగా కనిపిస్తోంది.
సమస్య డిజిటలైజేషన్‌లో లేదు; దాన్ని అమలు చేసే విధానంలో ఉంది. దేశంలోని ప్రతివ్యక్తిని గౌరవంగా లెక్కించడం జనగణన ధర్మం. డిజిటల్ వేదిక అందరికీ అందుబాటులో ఉండాలి. గణకులకు సరైన శిక్షణ, పరికరాలలో నాణ్యత, గోప్యతా హామీలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక సహాయక కేంద్రాలు ఇవన్నీ తప్పనిసరి. దళితులు, ఆదివాసీలు, వలస కార్మికులు, ఎవరూ కూడా జనగణన నుంచి తప్పిపోకూడదు.
అంతిమంగా జనగణన ఒక అద్దం. ఆ అద్దం మన సామాజిక వాస్తవాలను ప్రతిబింబిస్తుంది. డిజిటల్ అద్దం మరింత స్పష్టత ఇస్తుంది, కానీ అది మెరిపించాలంటే దాని అంచులను జాగ్రత్తగా పాలిష్ చేయాలి. 2027 జనగణన భారత్‌కు అతిపెద్ద సాంకేతిక పరీక్ష మాత్రమే కాదు; ఇది మానవత్వాన్ని అర్థం చేసుకునే సామర్థ్యానికి కూడా పరీక్ష. సాంకేతిక ఉత్సాహం ముందుకు పరుగులు తీస్తున్న ఈ సమయంలో, సామాజిక సున్నితతను మనం ఎంతగా కాపాడతామన్నదే ఈ జనగణన యొక్క నిజమైన విజయం.
