Let's talk: editor@tmv.in
2027 గోదావరి పుష్కరాలు: బాసర నుంచి భద్రాచలం వరకు భారీ ఏర్పాట్లు

2027 గోదావరి పుష్కరాలు: బాసర నుంచి భద్రాచలం వరకు భారీ ఏర్పాట్లు

Gaddamidi Naveen
30 మార్చి, 2026

తెలంగాణలో 2027 జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికల పురోగతిని సమీక్షించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు.

పుష్కరాల సమయానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. ఇందుకోసం అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు ఇంజనీర్లతో ప్రత్యేక సాంకేతిక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 15–20 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఆ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి తుది అంచనాలతో మంత్రివర్గ ఉపసంఘానికి పంపనున్నారు. అనంతరం సమగ్ర ప్రణాళికపై మంత్రిమండలి తుది నిర్ణయం తీసుకోనుంది.

పుష్కరాల కోసం చేపట్టాల్సిన పనులను శాశ్వత, తాత్కాలికంగా విభజించి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సీఎం సూచించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రజాభవన్‌లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధాన ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల నిర్మాణం, విస్తరణపై దృష్టి పెట్టాలని, భక్తుల రాకపోకలకు సౌకర్యవంతమైన రవాణా, కనెక్టివిటీ కల్పించాలని చెప్పారు.

ఇక బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను కూడా సమావేశంలో పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం పలు మార్పులు, సూచనలు చేశారు. పుష్కరాల సమయంలో భారీగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం సమన్వయంతో పని చేస్తూ పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు.