
2027 గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికలు: జగిత్యాల కలెక్టర్
2027 జూలైలో రానున్న గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా, ‘దక్షిణ భారత కుంభమేళా’ తలపించేలా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, ఆర్ అండ్ బీ, దేవదాయ, విద్యుత్ శాఖలతో పాటు ఇతర సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు. పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన అవసరమైన మౌలిక వసతులపై శాఖలవారీగా రూపొందించిన ప్రణాళికల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో సమర్పించిన నివేదికలను మండల స్థాయిలో మరోసారి సమీక్షించి, వారం రోజుల్లో సమగ్ర నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. పుష్కర స్నానాలకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
ప్రధాన ఆలయాల అభివృద్ధిపై దృష్టి
జిల్లాలోని గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ధర్మపురి, కోటిలింగాల ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసుకుని అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపారు.
జిల్లాలో ప్రవేశించే గోదావరి నది తీర ప్రాంతాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధి, అవసరమైన చోట్ల కొత్త ఘాట్ల నిర్మాణంపై చర్యలు చేపట్టాలని సూచించారు. ఒకే రోజు రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా రహదారుల విస్తరణ, పార్కింగ్ స్థలాలు, తాగునీటి సదుపాయం, స్నానాల ఘాట్లు, వసతి ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా వంటి అన్ని అంశాల్లో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
