Let's talk: editor@tmv.in
2027లో భారత్‌లో ఫార్ములా-1 రేసులు!

2027లో భారత్‌లో ఫార్ములా-1 రేసులు!

Shaik Mohammad Shaffee
14 ఏప్రిల్, 2026

భారత క్రీడా ప్రేమికులకు, ముఖ్యంగా రేసింగ్ అభిమానులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రపంచ ప్రఖ్యాత ఫార్ములా-1 (ఎఫ్1) రేసులను భారత్‌లో మళ్లీ నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. 2027 నాటికి దేశంలో ఎఫ్-1 రేసులను కచ్చితంగా నిర్వహిస్తామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సోమవారం ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తన నివాసంలో విలేకరులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రానున్న ఆరు నెలల్లో సంబంధిత అధికారులు, స్టేక్‌హోల్డర్లతో కీలక సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

బుద్ధ్ సర్క్యూట్‌కు పునర్వైభవం

గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో గతంలో 2011 నుంచి 2013 వరకు మూడు సార్లు ఎఫ్-1 రేసులు జరిగాయి. అయితే పన్ను సంబంధిత వివాదాలు, పరిపాలనాపరమైన అడ్డంకుల వల్ల గత 13 ఏళ్లుగా ఇక్కడ రేసింగ్ నిలిచిపోయింది. ఇటీవల కేంద్ర మంత్రి మాండవీయ స్వయంగా బుద్ధ్ సర్క్యూట్‌ను సందర్శించి, అక్కడి వసతులను పరిశీలించడంతో భారత గ్రాండ్ ప్రి పునరుద్ధరణపై ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలోనే 2027 లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

భారత్ సురక్షిత దేశం.. అందుకే మొగ్గు!

ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల దృష్ట్యా అంతర్జాతీయ క్రీడా సంస్థలు భారత్‌ను అత్యంత సురక్షితమైన దేశంగా భావిస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. "గల్ఫ్ దేశాల్లో పరిస్థితుల వల్ల అంతర్జాతీయ రేసింగ్ వర్గాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఎఫ్-1ను మళ్లీ ప్రారంభించేందుకు మేము చర్చలు జరుపుతున్నాం. ఈ రేసింగ్ నిర్వహణను ఆర్థికంగా లాభదాయకంగా మార్చడంపై మేము దృష్టి సారించాం" అని మాండవీయ వివరించారు. ఫిబ్రవరిలోనే క్రీడల మంత్రిత్వ శాఖ వర్గాలు భారత్‌లో ఎఫ్-1 పునరాగమనంపై సంకేతాలివ్వగా, తాజా ప్రకటనతో అది మరింత స్పష్టమైంది.

తొలి రేసుతో 2026 సీజన్ షురూ

మరోవైపు 2026 ఫార్ములా-1 సీజన్ ఇప్పటికే ఉత్సాహంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు బహ్రెయిన్‌లో జరిగిన ప్రీ-సీజన్ టెస్టింగ్ ముగిసిన అనంతరం, మార్చి 8న మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిస్‌తో ఈ ఏడాది రేసింగ్ సందడి మొదలైంది. భారత్ గనుక 2027లో రేసును ఖరారు చేస్తే, ప్రపంచ రేసింగ్ మ్యాప్‌లో దేశం మళ్లీ మెరవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.