
2027–జనగణన..40 ప్రశ్నలకు కేంద్రం ఒకే
జనగణన–2027లో భాగంగా జనాభా లెక్కల సేకరణ దశలో ప్రజలను అడగాల్సిన 40 ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫై చేసింది. ఇందులో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన కులగణనకు తొలిసారి అధికారికంగా చోటు కల్పించారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. కులం, మతం, విద్య, ఉపాధి, వలసలు, కుటుంబం తదితర జనాభా, సామాజిక-ఆర్థిక అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించనున్నారు.
ప్రశ్నల జాబితాలో కులం
జనగణనలో అడిగే ప్రశ్నల జాబితాలో 10వ ప్రశ్నగా ‘షెడ్యూల్డ్ కులం (ఎస్సీ)/షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)/కులం’ను చేర్చారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో అన్ని వర్గాల సమగ్ర కులగణన చేపట్టడం ఇదే తొలిసారి. 2011 జనగణన వరకు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కుల వివరాలను మాత్రమే క్రమబద్ధంగా సేకరించారు. ఇతర కులాల సమగ్ర గణనను జనగణనలో చేపట్టలేదు.అన్ని కులాల కులగణనను జనగణన–2027లో చేర్చాలని 2025 ఏప్రిల్ 30న కేంద్ర కేబినెట్ రాజకీయ వ్యవహారాల కమిటీ (సీసీపీఏ) నిర్ణయించింది.
వ్యక్తిగత వివరాల సేకరణ
జనగణనలో ప్రతి వ్యక్తికి సంబంధించిన పేరు, కుటుంబ పెద్దతో సంబంధం, లింగం, పుట్టిన తేదీ, వయసు, వైవాహిక స్థితి, వివాహ వయసు, జీవిత భాగస్వామి పేరు వంటి వివరాలను సేకరిస్తారు. అలాగే జాతీయత, మతం, కులం, తల్లిదండ్రుల వివరాలు, వైకల్యం, మాతృభాష, తెలిసిన ఇతర భాషలు, అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, విద్యాభ్యాసం, అత్యధిక విద్యార్హత తదితర అంశాలపై సమాచారం తీసుకుంటారు.
ఉద్యోగం, ఉపాధిపైనా ప్రశ్నలు
ఏడాది కాలంలో వ్యక్తి గతంగా పనిచేశారా? ఎలాంటి ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొన్నారు? వృత్తి ఏమిటి? పరిశ్రమ, వ్యాపారం లేదా సేవల స్వరూపం ఏమిటి? కార్మికుడిగా ఏ తరగతికి చెందుతారు? వంటి ప్రశ్నలు ఉంటాయి. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? పని చేసేందుకు అందుబాటులో ఉన్నారా? పని చేసే ప్రాంతానికి వెళ్లేందుకు ఎంత దూరం ప్రయాణిస్తున్నారు? వంటి వివరాలను కూడా సేకరిస్తారు.
వలస వివరాలపై ప్రత్యేక సమాచారం
వ్యక్తి పుట్టిన ప్రదేశం, చివరిగా నివసించిన ప్రాంతం, వలసకు కారణం, చివరిసారి వలస వచ్చిన తర్వాత ప్రస్తుత గ్రామం లేదా పట్టణంలో ఉంటున్న కాలం, శాశ్వత నివాస చిరునామా తదితర వివరాలను నమోదు చేస్తారు. మహిళలకు సంబంధించి ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల సంఖ్య, జీవితకాలంలో జన్మించిన పిల్లల సంఖ్య, గత ఏడాది కాలంలో సజీవంగా జన్మించిన పిల్లల వివరాలు కూడా నిర్దిష్ట వర్గాల నుంచి సేకరిస్తారు.
ఆధార్, ఓటర్ ఐడీ తదితర వివరాలు
40 ప్రశ్నల్లో కొవిడ్ టీకా తీసుకున్న ప్రదేశం, మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఓటర్ ఐడీ నంబర్, భారతీయ పాస్‌పోర్టు నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా వంటి వివరాలు కూడా ఉన్నాయి.
తొలిసారి డిజిటల్ జనగణన
జనగణన–2027 దేశంలో తొలి డిజిటల్ జనగణన కానుంది. డిజిటల్ పరికరాల ద్వారా సమాచారాన్ని సేకరించడంతో పాటు, ప్రజలకు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జనగణన చట్టం–1948లోని సెక్షన్ 8(1) కింద అధికారాలను వినియోగిస్తూ ఈ ప్రశ్నలను అడిగి వివరాలు సేకరించాలని జనగణన అధికారులను ఆదేశించింది.
వ్యక్తిగత సమాచారం గోప్యమే
జనగణనలో ప్రజలు అందించే వ్యక్తిగత సమాచారం అత్యంత గోప్యంగా ఉంచుతామని కేంద్ర హోంశాఖ పేర్కొంది. జనగణన చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం వ్యక్తిగత సమాచారాన్ని ప్రజలకు వెల్లడించరాదు. ఆర్టీఐ చట్టం కింద కూడా ఈ సమాచారాన్ని బహిర్గతం చేయలేరు. అలాగే కోర్టులో సాక్ష్యంగా ఉపయోగించడానికి లేదా ఇతర సంస్థలకు అందించడానికి వీల్లేదు. జనగణనకు జనగణన చట్టం–1948, జనగణన నిబంధనలు–1990 చట్టపరమైన ప్రాతిపదికగా ఉన్నాయి. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లోని 69వ అంశం ప్రకారం జనగణన కేంద్రం పరిధిలోని అంశం. కేంద్రం సమన్వయంతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సహకారంతో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
రెండు దశల్లో జనగణన
జనగణన–2027ను రెండు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహాల గణన చేపడతారు. ఇది 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సౌకర్యాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో 30 రోజుల వ్యవధిలో నిర్వహిస్తారు. ఇంటింటి గణనకు ముందు 15 రోజుల పాటు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ దశలో ఇళ్ల పరిస్థితి, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, కుటుంబాల వద్ద ఉన్న ఆస్తులు తదితర వివరాలను సేకరిస్తారు.
రెండో దశ జనాభా గణనను 2027 ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఇందులో వ్యక్తుల జనాభా, సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక, వలస, సంతానోత్పత్తికి సంబంధించిన వివరాలను సేకరిస్తారు. ఈ దశలోనే అన్ని కులాల గణన కూడా చేపడతారు. లడఖ్, మంచుతో కప్పబడే జమ్మూకశ్మీర్ ప్రాంతాలు, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని తదితర ప్రాంతాల్లో రెండో దశ జనాభా గణనను 2026 సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. జనగణన–2027 అమలుకు కేంద్ర కేబినెట్ రూ.11,718.24 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. భారతదేశ జనాభా, సామాజిక నిర్మాణం, విద్య, ఉపాధి, వలసలు తదితర అంశాలపై కీలకమైన గణాంకాలను ఈ జనగణన అందించనుంది.
