
2026 వింటర్ ఒలింపిక్స్ టార్చ్‌బేరర్‌గా అభినవ్ బింద్రా ఎంపిక
భారతదేశానికి 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని అందించిన షూటర్ అభినవ్ బింద్రా 2026 వింటర్ ఒలింపిక్స్ టార్చ్ రిలేకి టార్చ్ బేరర్‌గా ఎంపికయ్యారు. ఒలింపిక్ చరిత్రలో భారతదేశానికి మొట్టమొదటి వ్యక్తిగత బంగారు పతక విజేత అయిన బింద్రా, వచ్చే ఏడాది ఇటలీలో జరగబోయే ఈ ఈవెంట్‌కు ఎంపికైనట్లు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.
ఒలింపిక్స్.కామ్ ప్రకారం, బింద్రా తన సోషల్ మీడియాలో "మిలన్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్ టార్చ్ రిలేకు టార్చ్ బేరర్‌గా ఎంపిక నిజంగా నమ్మలేకపోతున్నా. ఒలింపిక్ జ్యోతి ఎల్లప్పుడే నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. దీనిని మరోసారి మోయడం అనేది ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ అద్భుతమైన గౌరవానికి మిలానో కోర్టినా 2026కి ధన్యవాదాలు" అని పోస్ట్ చేశారు. బింద్రా ఒలింపిక్ టార్చ్ రిలేలో పాల్గొనడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం పారిస్ ఒలింపిక్స్ టార్చ్ బేరర్‌గా కూడా ఆయన ఎంపికయ్యారు.
ఒలింపిక్ టార్చ్ రిలే గురించి
ఒలింపిక్ టార్చ్ రిలే అనేది వేసవి, శీతాకాల ఒలింపిక్స్ రెండింటికి ముందు జరిగే ఒక సాంప్రదాయ వేడుక. ఇందులో పవిత్రమైన ఒలింపిక్ జ్వాలను ప్రాచీన ఒలింపిక్స్ జరిగిన ప్రదేశమైన గ్రీస్‌లోని ఒలింపియా నుండి ఆతిథ్య నగరానికి మోసుకెళ్తారు. ఈ జ్వాల కలలు, పట్టుదల, జ్ఞానం, ప్రపంచ ఐక్యతను సూచిస్తుంది. రిలే మార్గంలో ఇది శాంతి, స్నేహం అనే ఒలింపిక్ స్ఫూర్తిని వ్యాప్తి చేస్తుంది.
గ్రీస్‌లోని ఒలింపియాలోని హేరా ఆలయం శిథిలాల వద్ద సూర్య కిరణాలను ఉపయోగించి పారాబోలిక్ అద్దం ద్వారా సాంప్రదాయ పద్ధతిలో జ్వాలను వెలిగిస్తారు. జ్వాలను వెలిగించిన తర్వాత అది మొదట గ్రీస్‌లో కొన్ని రోజుల పాటు ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఒక అధికారిక కార్యక్రమంలో జ్వాలను ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే దేశ నిర్వాహకులకు అప్పగిస్తారు. అక్కడి నుంచి జ్వాల ఆతిథ్య దేశంలోని వివిధ ప్రాంతాలు, ముఖ్యమైన చారిత్రక ప్రదేశాల గుండా పయనిస్తుంది. ఈ ప్రయాణంలో వేలాది మంది టార్చ్‌బేరర్‌లు (సాధారణంగా ప్రముఖులు, అథ్లెట్లు, కమ్యూనిటీ నాయకులు) టార్చ్‌ను ఒకరి నుండి మరొకరికి మారుస్తూ రిలేను కొనసాగిస్తారు.
