
2026 వరల్డ్ కప్ టికెట్ ధరలు పెంచిన ఫీఫా… అభిమానుల ఆగ్రహం
2026 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టికెట్ ధరలను ఫీఫా భారీగా పెంచడంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందుగా చేసిన హామీలు నిలబెట్టుకోకుండా ఇలా ధరలు పెంచడం “ద్రోహం” అని అభిమాన సంఘాలు ఆరోపిస్తున్నాయి.
జర్మనీ ఫుట్‌బాల్ సమాఖ్య విడుదల చేసిన తాజా ధరల జాబితా ప్రకారం గ్రూప్ మ్యాచ్‌ల టికెట్లు కనీసం 180 డాలర్ల నుంచి 700 డాలర్ల వరకు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్‌కు కనీస ధర 4,185 డాలర్లు కాగా, అత్యధికం 8,680 డాలర్లుగా నిర్ణయించారు. ఈ ధరలు ఫీఫా ఇంతకుముందు చెప్పిన 60 డాలర్ల చౌక టికెట్ల హామీకి పూర్తిగా వ్యతిరేకం.
అదేకాలంలో, అమెరికా – కానడా – మెక్సికో సంయుక్తంగా వరల్డ్ కప్ నిర్వహించేందుకు 2018లో బిడ్ ఇచ్చినప్పుడు, లక్షల సంఖ్యలో 21 డాలర్ల టికెట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ తాజా ధరల్లో ఆ హామీ అసలు కనిపించడంలేదు.
అభిమానుల హక్కుల కోసం పనిచేసే ఫుట్‌బాల్ సపోర్టర్స్ యూరోప్ ఈ ధరలను “అత్యంత దోపిడీ”గా పేర్కొంది. “వరల్డ్ కప్ సంప్రదాయానికి, అభిమానుల పాత్రకు ఇది అన్యాయం. ఇది పెద్ద మోసం” అని ఒక ప్రకటనలో పేర్కొంది. వెంటనే జాతీయ ఫుట్‌బాల్ సంస్థలు టికెట్ విక్రయాలు ఆపాలని ఫీఫాను డిమాండ్ చేసింది.
ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ విడుదల చేసిన ఇతర వివరాల ప్రకారం, ఒక అభిమాని ఇంగ్లాండ్ మ్యాచ్‌లన్నింటికీ గ్రూప్ దశ నుంచి ఫైనల్ వరకు హాజరయ్యాలంటే 7,000 డాలర్లకు పైగా ఖర్చవుతుంది.
ఫీఫా గత సెప్టెంబర్‌లో ప్రకటించిన ధరలు కూడా ఇప్పుడు మారిపోయే అవకాశాలున్నాయి. ఈసారి ఫీఫా డైనమిక్ ప్రైసింగ్ పద్ధతిని మొదటిసారి వరల్డ్ కప్‌లో అమలు చేస్తోంది. డిమాండ్ పెరిగితే ధరలు కూడా ఆటోమేటిక్‌గా పెరిగే విధా నం ఇది. దీంతో చౌక టికెట్ లభ్యత మరింత కష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
డ్రా పూర్తయ్యాక అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో మ్యాచ్‌లకు టికెట్ల కోసం పోటీ తీవ్రమవుతోంది. ఇద్దరూ తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో ముగిస్తే, కాన్సాస్ సిటీలో క్వార్టర్ ఫైనల్‌లో తలపడే అవకాశం ఉంది.
టికెట్ దరఖాస్తుల మూడో దశను ఫీఫా ఇప్పటికే ప్రారంభించింది. డిసెంబర్ 11 నుంచి జనవరి 13, 2026 వరకు అభిమానులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక కుటుంబం ప్రతి మ్యాచ్‌కు గరిష్టంగా నాలుగు టికెట్లు, మొత్తం 40 టికెట్లు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు ఫలితాలు ఫిబ్రవరిలో మెయిల్ ద్వారా తెలియజేయబడతాయి.
1994లో అమెరికా వరల్డ్ కప్ నిర్వహించినప్పుడు టికెట్ ధరలు 25 నుంచి 475 డాలర్ల మధ్య ఉండగా, 2022 ఖతార్ వరల్డ్ కప్‌లో ధరలు 70 నుంచి 1,600 డాలర్ల వరకు ఉన్నాయి. ఈసారి ధరలు ఇప్పటివరకు ఉన్నవాటిలోనే అత్యంత ఎక్కువగా నమోదయ్యాయి.
ఇక సెకండరీ మార్కెట్లలో ఇప్పటికే ఫైనల్ మ్యాచ్ టికెట్లు 11,000 డాలర్లకు పైగా విక్రయమవుతున్నాయి. ఫీఫా సొంత రీసేల్ ప్లాట్‌ఫామ్ కూడా ఈసారి అందుబాటులో ఉంటుంది. కానీ అక్కడ 15% సేవా రుసుము వసూలు చేయనుంది.
మిగిలిన టికెట్లను ఎప్పుడు విక్రయానికి విడుదల చేస్తారానేది ఫీఫా ఇంకా స్పష్టంగా చెప్పలేదు.
