
2026 లో నిశ్శబ్దంగా పరుగులు తీయనున్న పొగలేని రంగం
భారతదేశ అభివృద్ధి గమనంలో పర్యాటక రంగం ఎప్పుడూ కనిపించని శక్తిలా పనిచేస్తోంది. భారీ పరిశ్రమల మాదిరిగా పొగలు కక్కే కర్మాగారాలు లేకుండానే కోట్ల మందికి ఉపాధి కల్పించే రంగం ఇది. హోటళ్లు, రెస్టారెంట్లు, టాక్సీలు, రైళ్లు, విమానాలు, హస్తకళలు, స్థానిక ఆహార ఉత్పత్తులు, గైడ్ సేవలు ఇలా అనేక రంగాలను పరోక్షంగా జీవింపజేస్తుంది.
కేంద్రం యూనియన్ బడ్జెట్ 2026–27లో ఈ వాస్తవాన్ని పూర్తిగా గుర్తించి, పర్యాటకాన్ని కేవలం వినోద రంగంగా కాకుండా దేశ ఆర్థిక నిర్మాణంలో కీలక స్థంభంగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. భారత పర్యాటక డేటా 2025 ప్రకారం పర్యాటక రంగం జీడీపీలో 5.22 శాతం మొత్తం ప్రభావాన్ని కలిగి ఉండటం, దేశ ఉపాధిలో 13 శాతం పైగా వాటా ఉండటం ఈ రంగం సామాజిక, ఆర్థిక ప్రాముఖ్యతను స్పష్టంగా చూపిస్తోంది. అందుకే ఈ బడ్జెట్‌లో పర్యాటకం ఉద్యోగాల సృష్టి, ప్రాంతీయ సమతుల్యత, పెట్టుబడుల ఆకర్షణ, సుస్థిర అభివృద్ధికి ప్రధాన ఆయుధంగా మారింది.
ఈశాన్య భారతంలో ఆధ్యాత్మిక వెలుగులు: బుద్ధుని అడుగుజాడల్లో..
కేంద్ర ప్రతిపాదనల్లో అత్యంత ప్రాధాన్యత పొందిన అంశాల్లో ఒకటి ఈశాన్య భారతంలో బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి పథకం. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాలు శతాబ్దాల నాటి బౌద్ధ సంస్కృతికి నిలయాలు. అయితే సరైన రవాణా, వసతి, సమాచార సదుపాయాల లేమి వల్ల ఇవి అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక పటంలో పూర్తిగా స్థానం సంపాదించలేకపోయాయి.
ఈసారి ఈ పథకం ద్వారా పురాతన బౌద్ధ మఠాలు, దేవాలయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. ఇది కేవలం మతపరమైన పర్యటనే కాకుండా, ఆ ప్రాంతాల సామాజిక-ఆర్థిక స్థితిగతులను మార్చేలా రూపొందించబడింది. యాత్రికుల కోసం ప్రత్యేక 'ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్లు' (వివరణాత్మక కేంద్రాలు) ఏర్పాటు చేస్తారు.
అలాగే, ఆలయాలు, మఠాల సంరక్షణ, తీర్థయాత్ర వివరణ కేంద్రాల ఏర్పాటు, రోడ్డు, రైలు కనెక్టివిటీ మెరుగుదల, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన జరగనుంది. ఇది కేవలం పర్యాటకాన్ని పెంచడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి, చిన్న వ్యాపారాలకు ఆదాయం, ఈశాన్య ప్రాంతాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది.
స్వదేశ్ దర్శన్ 2.0
ఈ కొత్త బౌద్ధ సర్క్యూట్ పథకం ఒక్కసారిగా వచ్చిన ఆలోచన కాదు. ఇది 2014–15లో ప్రారంభమైన స్వదేశ్ దర్శన్ పథకం అనుభవాలపై ఆధారపడి రూపుదిద్దుకుంది. స్వదేశ్ దర్శన్ పథకం దేశవ్యాప్తంగా థీమ్ ఆధారిత పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. కాలక్రమంలో పర్యాటక ధోరణులు మారడంతో, పర్యావరణ సుస్థిరత, స్థానిక ప్రజల భాగస్వామ్యం, జీవనోపాధుల మెరుగుదలపై దృష్టి పెట్టేందుకు దీనిని స్వదేశ్ దర్శన్ 2.0 గా మార్చారు. ఇప్పటివరకు 76 ప్రాజెక్టులకు రూ.5,290.33 కోట్ల నిధులు మంజూరై, వాటిలో 75 పూర్తవడం ప్రభుత్వ అమలు సామర్థ్యాన్ని చూపిస్తోంది. ఈ అనుభవాలే బడ్జెట్ 2026–27లో ప్రతిపాదించిన కొత్త పథకాలకు పునాదిగా నిలిచాయి.
ఎకో-ట్రెయిల్స్, నేచర్ టూరిజం
వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న వేళ, భారత్ పర్యాటక అభివృద్ధిలో ప్రకృతిని కేంద్రంగా పెట్టింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ–కాశ్మీర్, అరకు లోయ, పొదిగై మలై ప్రాంతాల్లో ఈకో-ట్రైల్స్ అభివృద్ధి చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఒడిశా, కర్ణాటక, కేరళ తీరాల్లో తాబేళ్ల ట్రైల్స్, ఆంధ్రప్రదేశ్‌లో పులికాట్ సరస్సు వద్ద పక్షి వీక్షణ ట్రైల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇవి పర్యాటకులను ఆకర్షించడమే కాదు, స్థానిక సముదాయాలను ప్రకృతి సంరక్షణలో భాగస్వాములుగా మారుస్తాయి. ఈ విధంగా పర్యాటకం ఒకవైపు ఆదాయం అందిస్తే, మరోవైపు జీవ వైవిధ్యాన్ని కాపాడే సాధనంగా మారుతోంది.
గమ్యస్థానాలకు గ్రీన్ కనెక్టివిటీ
పర్యాటక అభివృద్ధికి మౌలికంగా అవసరమైనది రవాణా. బడ్జెట్ 2026–27 రైలు, రీజినల్ కనెక్టివిటీ, హైస్పీడ్ రైళ్ల విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దూర ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలను ప్రధాన పర్యాటక ప్రవాహంలోకి తీసుకురావడం దీని లక్ష్యం. రహదారులు, రైల్వే స్టేషన్లు, ఎలక్ట్రిక్ బస్సుల వంటి సౌకర్యాలు పెరిగితే, పర్యాటకుల సంఖ్య పెరగడమే కాకుండా స్థానిక ఉత్పత్తులకు మార్కెట్లు విస్తరిస్తాయి.
పర్యాటక ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించి, సుస్థిర పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి పూర్వోదయ రాష్ట్రాల్లో 4,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇది పర్యాటకులకు పర్యావరణ హితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇది పర్యాటకాన్ని ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా, విస్తృత ఆర్థిక వ్యవస్థతో అనుసంధానిస్తుంది.
గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ 2026: పర్యావరణ దౌత్యం
భారతదేశం వన్యప్రాణుల సంరక్షణలో తన ఆధిపత్యాన్ని చాటుతూ, 95 దేశాల ప్రతినిధులతో ప్రపంచంలోనే మొదటి 'బిగ్ క్యాట్ సమ్మిట్'ను 2026లోనే నిర్వహించనుంది. పులి, సింహం, చిరుత వంటి ఐదు రకాల పెద్ద పిల్లి జాతులు ఉన్న ఏకైక దేశంగా భారత్, ఈ సదస్సు ద్వారా 'వైల్డ్ లైఫ్ టూరిజం'లో గ్లోబల్ లీడర్‌గా ఎదగనుంది.
95 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు అడవి జీవ సంరక్షణ, శాస్త్రీయ సహకారం, సుస్థిర వైల్డ్‌లైఫ్ పర్యాటకంపై చర్చించనుంది. భారత్ ప్రపంచంలోని ఏడు పెద్ద పిల్లి జాతుల్లో ఐదింటికి నిలయం కావడం మన దేశానికి ప్రత్యేకత. ఈ నాయకత్వం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ద్వారా మరింత బలపడింది. ఈ అంతర్జాతీయ సంస్థకు ప్రధాన కార్యాలయం భారత్‌లోనే ఉండడం మన దేశానికి గర్వకారణం. ఈ సమ్మిట్‌తో పర్యాటకం కేవలం ఆర్థిక రంగం కాకుండా, అంతర్జాతీయ దౌత్య సాధనంగా మారుతోంది.
హాస్పిటాలిటీ రంగానికి కొత్త ఊపిరి
పర్యాటక రంగం విజయానికి మానవ వనరుల నాణ్యత కీలకం. అందుకే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. అంతర్జాతీయ ప్రమాణాల విద్య, పరిశోధన, పరిశ్రమ, విద్య అనుసంధానం ద్వారా హాస్పిటాలిటీ రంగానికి నిపుణులైన యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణను అందిస్తుంది. అదనంగా, పర్యాటకులకు నాణ్యమైన సమాచారం అందించడానికి 20 ప్రధాన పర్యాటక కేంద్రాల్లోని 10,000 మంది గైడ్‌లకు ఐఐఎంల సహకారంతో 12 వారాల ప్రత్యేక శిక్షణ ఇస్తారు. దీనివల్ల గైడింగ్ సేవలు మరింత వృత్తిపరంగా మారుతాయి, స్థానికులకు మెరుగైన ఉపాధి లభిస్తుంది.
చరిత్రకు జీవం - 15 అద్భుత పురావస్తు కేంద్రాలు
భారతదేశం వేల ఏళ్ల చరిత్ర కలిగిన దేశం. అయినా చాలా పురావస్తు ప్రదేశాలు ఇప్పటికీ పూర్తిస్థాయి పర్యాటక ఆకర్షణలుగా మారలేదు. లోథల్, ధోలావీరా, రాఖీగఢి, సార్నాథ్, హస్తినాపుర్, లేహ్ ప్యాలెస్ వంటి 15 ప్రదేశాలను అనుభూతి ప్రధాన సాంస్కృతిక కేంద్రాలు('వైబ్రెంట్ కల్చరల్ డెస్టినేషన్స్')గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వాకింగ్ ట్రైల్స్, వివరణ కేంద్రాలు, సందర్శక సౌకర్యాలు ఈ ప్రదేశాలను జీవంతంగా మారుస్తాయి. ఇవి ప్రసాద్ స్కీమ్ వంటి పథకాలతో సమన్వయంగా అమలవుతాయి. ఇక్కడి ప్రాంతాలను కేవలం చూసి వెళ్లడం కాకుండా, ఆ చరిత్రను అనుభవించేలా క్యూరేటెడ్ వాక్‌వేలు, మ్యూజియాలు నిర్మిస్తారు.
మెడికల్ టూరిజం -* *ఆరోగ్యంతో కూడిన అభివృద్ధి
ప్రపంచవ్యాప్తంగా మెడికల్ టూరిజం వేగంగా పెరుగుతోంది. భారత్ తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించే దేశంగా గుర్తింపు పొందింది. ఈ బలాన్ని మరింత పెంచేందుకు, భారతదేశాన్ని ప్రపంచ 'మెడికల్ టూరిజం' కేంద్రంగా మార్చడానికి ఐదు ప్రాంతీయ మెడికల్ హబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ అత్యాధునిక ఆసుపత్రులతో పాటు, ఆయుర్వేదం, యోగా వంటి ఆయుష్ కేంద్రాలను అనుసంధానిస్తారు. ఆధునిక వైద్య సేవలు, ఆయుష్ కేంద్రాలు, రిహ్యాబిలిటేషన్ సదుపాయాలు కలిపిన ఈ హబ్‌లు భారత్‌ను ప్రపంచ ఆరోగ్య పర్యాటక కేంద్రంగా మార్చగలవు. ఇది వైద్య రంగానికే కాకుండా హోటళ్లు, రవాణా, సేవా రంగాలకు కూడా లాభం చేకూరుస్తుంది.
'పూర్వోదయ' - తూర్పు భారతం వైపు అడుగులు
తూర్పు భారతదేశంలోని ఐదు రాష్ట్రాలు (బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్) ను కేంద్రంగా చేసుకున్న పూర్వోదయ వ్యూహం బడ్జెట్‌లో కీలక భాగం. ఒక్కో రాష్ట్రంలో ఒక ప్రధాన పర్యాటక గమ్యం అభివృద్ధి చేయడం, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్‌తో అనుసంధానం, 4,000 ఈ–బస్సుల ఏర్పాటు వంటి చర్యలు పర్యాటకాన్ని ప్రాంతీయ అభివృద్ధికి ఇంధనంగా మారుస్తాయి. దీనివల్ల ప్రాంతీయ అసమానతలు తొలగి, తూర్పు భారతం పర్యాటక హబ్‌గా మారుతుంది.
నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్
భారతదేశంలోని అన్ని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాల సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తారు. ఈ 'డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్' ద్వారా పర్యాటకులు తమ పర్యటనను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు, పరిశోధకులకు ఇది ఒక నిధిలా ఉపయోగపడుతుంది.
మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం పర్యాటకాన్ని భారత్ భవిష్యత్తు అభివృద్ధి నిర్మాణంలో ముఖ్య కేంద్రంగా నిలబెట్టనుంది. ఈ ప్రణాళికలు సమర్థవంతంగా అమలైతే, పొగలేని పర్యాటక రంగం కోట్లాది మందికి ఉపాధి కల్పించి, భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక సమగ్ర, సుస్థిర, సాంస్కృతికంగా సమృద్ధమైన గమ్యస్థానం గా మార్చుతుంది.
