
2026 ఏడాదికి సెలవులు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు విడుదలైన ఈ ఉత్తర్వుల్లో మొత్తం 27 సాధారణ సెలవులను , 26 ఐచ్ఛిక సెలవులను ప్రకటించారు. ఈ సాధారణ సెలవు దినాలలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేస్తారు. వీటిలో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం, రంజాన్, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఐచ్ఛిక సెలవులలో ఉద్యోగులు తమకు నచ్చిన ఐదు రోజులు వినియోగించుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆదేశాల మేరకు.. సాధారణ పరిపాలన విభాగం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రధాన సాధారణ సెలవు దినాలు 2026
తెలంగాణ ప్రజలు జరుపుకునే ప్రధాన పండుగలు, జాతీయ దినోత్సవాలను దృష్టిలో ఉంచుకుని సాధారణ సెలవులను ప్రకటించారు. వీటిలో కొన్ని ముఖ్యమైనవి..భోగి (జనవరి 14) సంక్రాంతి (జనవరి 15), గణతంత్ర దినోత్సవం (జనవరి 26), హోలీ (మార్చి 3), ఉగాది (మార్చి 19), ఈదుల్ ఫితర్ / రంజాన్ (మార్చి 21), శ్రీ రామ నవమి (మార్చి 27), డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14), ఈదుల్ అజహా / బక్రీద్ (మే 27), బోనాలు (ఆగస్టు 10), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15), వినాయక చవితి (సెప్టెంబర్ 14), విజయ దశమి / దసరా (అక్టోబర్ 20), దీపావళి (నవంబర్ 8), క్రిస్మస్ (డిసెంబర్ 25). ఈ సెలవులతో పాటు.. ప్రతి నెలలోని ఆదివారాలు, రెండవ శనివారాలు కూడా యథావిధిగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినాలుగా కొనసాగుతాయి.
ఐచ్ఛిక సెలవులు..
సాధారణ సెలవులతో పాటు.. 2026 సంవత్సరంలో ప్రభుత్వం ప్రకటించిన 26 ఐచ్ఛిక సెలవుల జాబితా కూడా ఉంది. ఈ సెలవులలో ఉద్యోగులు తమ మతాచారాలు లేదా వ్యక్తిగత ప్రాధాన్యతలను బట్టి.. మొత్తం ఐచ్ఛిక సెలవుల్లో నుంచి ఐదు రోజులు మాత్రమే వినియోగించుకునే సదుపాయం ఉంటుంది. ముఖ్యమైన ఐచ్ఛిక సెలవులు (2026).. న్యూ ఇయర్ డే (జనవరి 1), కనుమ (జనవరి 16), శ్రీ పంచమి (జనవరి 23), మహావీర్ జయంతి (మార్చి 31), బుద్ధ పౌర్ణమి (మే 1), నరక చతుర్దశి (నవంబర్ 8), క్రిస్మస్ ఈవ్ (డిసెంబర్ 24). ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ పండుగలు, రాష్ట్ర పండుగలు , మతపరమైన వేడుకలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సెలవుల జాబితాను రూపొందించింది.
